‘సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం’ | Minister Uttam Kumar On Super EL Nino | Sakshi
Sakshi News home page

‘సూపర్ ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం’

Jul 18 2026 9:01 PM | Updated on Jul 18 2026 9:04 PM

Minister Uttam Kumar On Super EL Nino

హైదరాబాద్: వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న "సూపర్ ఎల్ నినో" పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని హోటల్ అవాసాలో "సింపోజియం" సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వాతావరణ మార్పులు (Climate Change) అంశంపై సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ, తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

గతంలో నమోదైన వర్షపాతం నమూనాల ఆధారంగా ఇకపై జలవనరుల ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నర సంవత్సరాల పాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని, సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని తెలిపారు.

అయితే ప్రస్తుత వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని పేర్కొన్నారు. నిపుణులు సూచిస్తున్న "సూపర్ ఎల్ నినో" పరిస్థితులను ప్రభుత్వం అత్యంత గంభీరంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ముందస్తు నీటి నిర్వహణపై దృష్టి
వర్షాభావం తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కాకుండా, ముందుగానే పరిస్థితులను అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, తాగునీరు, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని చెప్పారు. రిజర్వాయర్ల నిర్వహణలో రియల్‌టైమ్ డేటా వినియోగం, శాస్త్రీయ నిర్ణయాలు, శాఖల మధ్య సమన్వయంతో ముందస్తు ప్రణాళికలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

పాలనకు ఇదే అసలైన పరీక్ష
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల నుంచి రైతులను రక్షించగలగడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష అని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు జలవనరులపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎంత వేగంగా మారుతున్నాయన్నదే అసలు సవాలని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నీరే పునాది
నీటిని కేవలం పంపిణీ చేసే వనరుగా కాకుండా, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా చూడాలని మంత్రి ఉత్తమ్ అన్నారు. నీటి నిర్వహణలో లోపాలు ఏర్పడితే వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

హైదరాబాద్‌కు దీర్ఘకాలిక తాగునీటి భద్రత
హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి తాగునీటిని అందించే దీర్ఘకాలిక ప్రణాళికలను గత ప్రభుత్వాలు అమలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఒకప్పుడు 50 నుంచి 100 అడుగుల లోతులో లభించిన భూగర్భ జలం, ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు చేరుకుందని చెప్పారు. వర్షపు నీటిని భూగర్భంలోకి చేరేలా భారీ స్థాయిలో రైన్‌వాటర్ హార్వెస్టింగ్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. 

పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీటీకరణ వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ తగ్గిపోవడంతో వర్షపు నీటి సంరక్షణ అత్యవసరమైందన్నారు. హైదరాబాద్‌లో చెరువులు, నీటి వనరులు, సహజ కాలువలను పరిరక్షించేందుకు ప్రత్యేకంగా హైడ్రా (HYDRA) వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గతంలో జరిగిన ఆక్రమణల వల్ల నగరంలో వరద ముప్పు పెరిగిందని, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, సహజ డ్రైనేజీ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement