సిటీలో ‘ఫిఫా’ ఫైనల్‌ ‘కిక్‌’! | FIFA World Cup final: Hyderabad bars and clubs to stay open till 3 AM | Sakshi
Sakshi News home page

సిటీలో ‘ఫిఫా’ ఫైనల్‌ ‘కిక్‌’!

Jul 18 2026 5:52 AM | Updated on Jul 18 2026 5:52 AM

FIFA World Cup final: Hyderabad bars and clubs to stay open till 3 AM

అర్ధరాత్రి దాటినా తెరుచుకోనున్న హైదరాబాద్‌ పబ్‌లు, బార్లు 

19న ఉదయం 4.30 వరకు, 20న ఉదయం 3 వరకు అనుమతి  

సాక్షి, హైదరాబాద్‌: ఫిఫా వరల్డ్‌ కప్‌ 2026 ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని క్రీడాభిమానులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే వార్త చెప్పింది. అర్జెంటీనా, స్పెయిన్‌ మధ్య జరగనున్న ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు వీలుగా నగరంలోని బార్లు, పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రత్యేకంగా పనివేళలను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌ ప్రాంతం) పరిధిలోని బార్లు, క్లబ్‌లు, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఇన్‌–హౌస్‌ బార్లు, మైక్రోబ్రూవరీలకు మద్యం సరఫరా చేసేందుకు అదనపు సమయం కేటాయించారు.

థర్డ్‌ ప్లేస్‌ ప్లే–ఆఫ్‌ మ్యాచ్‌ సందర్భంగా 19న ఉదయం 04:30 వరకు, ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం 20న ఉదయం 03:00 గంటల వరకు అనుమతి ఇస్తారు. ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ సోమవారం (జూలై 20) తెల్లవారుజామున 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే నగరంలోని ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో ఫుట్‌బాల్‌ హంగామా షురూ కానుంది.

సమయ వేళల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా నూతన సంవత్సర వేడుకల తరహాలోనే కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర చర్యలు తీసుకోనున్నారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలుంటాయి. నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై, పబ్‌లలో హద్దులు మీరి ప్రవర్తించే వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement