91 నమూనాల సేకరణ, 5 సంస్థలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ శాఖ ఉక్కుపాదం మోపింది. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి ఇతర కొవ్వులు కలుపుతున్నారన్న సమాచారంతో ఈనెల 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలోని 14 సంస్థల్లో తనిఖీలు చేపట్టి 15 నెయ్యి నమూనాలు సేకరించారు. వినియోగానికి పనికిరాదని గుర్తించిన 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేయగా, 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వా«దీనం చేసుకున్నారు.
రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 65 సంస్థలను పరిశీలించి 91 నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థలకు నోటీసులు జారీచేశారు. పామాయిల్ లేదా వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వులు కలపడం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 ప్రకారం నిషేధమని కమిషనర్ వివరించారు. అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు చేయాలని సంగీత సత్యనారాయణ సూచించారు.


