గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల విశాల్ తివారీ ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నీట్ పరీక్షలో 720కి 605 మార్కులు సాధించి తన పట్టుదలను నిరూపించుకున్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే తండ్రి సంతోష్ తివారీ, గృహిణి అయిన తల్లి రాధికా తివారీ తమ కుమారుడి లక్ష్యం కోసం ఎంతగానో శ్రమించారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ విశాల్ చదువుకు ఆటంకం కలగకుండా చూశారు.
2022లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విశాల్, మొదట్లో స్వయంగా చదువుకున్నా విజయం దక్కలేదు. అనంతరం కుటుంబ సభ్యుల సహకారంతో కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో ఈ ఘనత సాధించారు. వివాహం జరిగి, ఒక కుమారుడు ఉన్నప్పటికీ బాధ్యతలను భుజాన వేసుకుని, మరోవైపు హోమ్ ట్యూషన్లు చెబుతూ చదువును కొనసాగించారు. ఉదయం కోచింగ్, సాయంత్రం ట్యూషన్లు, రాత్రి వరకు లైబ్రరీలో చదువుతూ విశాల్ కఠిన క్రమశిక్షణను పాటించారు. ఇంజనీర్ కావాలనుకున్న విశాల్, తన పెద్దనాన్న సలహాతో వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇప్పుడు వైద్యుడిగా స్థిరపడి, తన తండ్రికి కారు కొనివ్వాలనేదే తన చిరకాల స్వప్నమని విశాల్ తెలిపారు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: 15 నిమిషాల ఓవర్‌టైమ్‌కీ డబ్బులిచ్చే వింత దేశం!


