సాక్షి, ఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్ ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో నిరసనకారుల అడ్డగింత.. నినాదాలతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతవరణం నెలకొంది.
విద్యా వ్యవస్థలో పటిష్టమైన సంస్కరణలు కోరడంతో పాటు ఇటీవలి పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ గత 21 రోజులుగా వాంగ్‌చుక్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 9 కేజీల బరువు తగ్గగా.. ఆయన పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే..
#WATCH | Delhi: Activist Sonam Wangchuk, who was sitting on a hunger strike from last 20 days at Jantar Mantar, taken to the hospital by the police.
More details awaited. pic.twitter.com/81DTO3cyh4— ANI (@ANI) July 18, 2026
ఈ ఉదయం ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి రోజు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించింది. “ప్రతి పౌరుడి జీవితం విలువైనది” అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సూచనల మేరకు సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రికి తరలించాం. ఈ చర్యను పోలీసులు పూర్తి సంయమనంతో, సురక్షితంగా చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి అని స్థానిక డీసీపీ ఓ ట్వీట్ చేశారు.
చకచకా పరిణామాలు
నీట్ అవకతవకల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జూన్ 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ పోరాటానికి మద్దతుగా సోనం వాంగ్‌చుక్ రంగంలోకి దిగారు. అయితే తొలుత ఆయన దీక్షకు పెద్దగా స్పందన రాలేదు. పోను పోను సినీ, రాజకీయ నేతలు వాంగ్‌చుక్‌కు సంఘీభావం ప్రకటించడంతో మద్దతు పెరుగుతూ వచ్చింది.
ఎల్లుండి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదే తేదీన (20న) ఛలో పార్లమెంట్ నినాదంతో ర్యాలీ చేపట్టాలని సీజేపీ భావించింది. ఈ కార్యక్రమానికి తరలి రావాలంటూ ఇటు దీక్షా వేదికగానే వాంగ్‌చుక్ కూడా పిలుపు ఇచ్చారు. సుమారు లక్షన్నర మందికి పైగా ఆ ర్యాలీలో పాల్గొంటారనే అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అనురాగ్ కుమార్ ఢిల్లీ కమిషనర్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే వాంగ్‌చుక్ దీక్ష భగ్నం కావడం గమనార్హం.


