మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తెర వెనుక కదలికలు మొదలయ్యాయా? కొంతకాలంగా దూరంగా ఉన్న రాజకీయ శిబిరాల మధ్య పెరుగుతున్న రాకపోకలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న నేతలు అధికార కూటమి పెద్దలను కలుస్తుండటం.. కీలక నాయకుల మధ్య జరుగుతున్న భేటీలు.. భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న పవార్ కుటుంబం చుట్టూ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ నుంచి ముంబై వరకు హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శరద్ పవార్ వర్గానికి చెందిన నేతల భేటీలు, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ సమావేశాలు అధికారికంగా స్థానిక సమస్యల పరిష్కారం కోసమేనని నేతలు చెబుతున్నప్పటికీ.. తెర వెనుక రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మాత్రం జోరందుకున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్‌చంద్ర పవార్) ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతోందా? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ పరిణామాల వెనుక బీజేపీ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
బీజేపీ వ్యూహం ప్రకారం.. ముందుగా విడిపోయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వర్గాలను మళ్లీ దగ్గర చేయడం, ఆ తర్వాతే ఎన్డీఏతో సంబంధాలపై ముందుకు వెళ్లడం లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే కేవలం శరద్ పవార్ వర్గాన్ని కూటమిలోకి తీసుకోవడం కాకుండా.. మొత్తం ఎన్సీపీని ఒకే రాజకీయ శక్తిగా మార్చి ఎన్డీఏలోకి తీసుకురావాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం.
2023 జూలైలో అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీ-శివసేన (షిండే వర్గం) ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది. శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) పేరుతో కొనసాగుతోంది.
ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ వర్గం అధికారంలో భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు శరద్ పవార్ వర్గం ప్రతిపక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దగ్గరవడం జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బీజేపీ వ్యూహంలో మూడు దశలు?
రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. బీజేపీ వ్యూహం మూడు దశల్లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మొదట పవార్ వర్గాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేయడం, రెండో దశలో ఎన్సీపీ పునరేకీకరణ, మూడో దశలో ఎన్డీఏతో అధికారిక అనుబంధం వంటి అంశాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరద్ పవార్ వర్గాన్ని నేరుగా ఎన్డీఏలోకి తీసుకోవడంపై బీజేపీలో కొంత సంకోచం ఉందని సమాచారం. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు పరిష్కారమైతేనే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనం ఉంటుందని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి అసలు లాభం ఏంటి?
ఈ మొత్తం పరిణామాల్లో బీజేపీకి ఉన్న ప్రధాన రాజకీయ లాభం ఏమిటన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో శరద్ పవార్‌కు దశాబ్దాలుగా ఉన్న రాజకీయ ప్రభావం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పట్టు బీజేపీకి కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీకి అధికార బలం ఉన్నప్పటికీ.. మరాఠా రాజకీయాల్లో పవార్ కుటుంబ ప్రభావాన్ని పూర్తిగా పక్కన పెట్టడం అంత సులువు కాదు. శరద్ పవార్ వర్గం ఎన్డీఏకు దగ్గరైతే.. ప్రతిపక్ష శక్తులను బలహీనపరచడంతో పాటు, భవిష్యత్ ఎన్నికల్లో కూటమికి అదనపు బలం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చూస్తే.. మహారాష్ట్రలో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయడం బీజేపీకి కీలక వ్యూహంగా మారనుంది. ప్రస్తుతం శరద్ పవార్ వర్గం ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ప్రతిపక్షాలకు ఓ రాజకీయ ఆధారం లభిస్తోంది. ఆ వర్గం ఎన్డీఏ వైపు వస్తే.. ఇండియా కూటమికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా పార్లమెంట్‌లో కీలక బిల్లులపై సంఖ్యాబలం కూడా బీజేపీకి ఉపయోగపడుతుంది. లోక్‌సభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్న NCP(SP) మద్దతు లేదా అనుకూల వైఖరి కేంద్రానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగించవచ్చు.
మరోవైపు మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాల్లో కూడా పవార్ వర్గాల కలయిక బీజేపీ-షిండే-అజిత్ కూటమికి అదనపు బలం ఇవ్వగలదన్న అంచనాలు ఉన్నాయి.
అయితే దీనికి మరో వైపు కూడా ఉంది. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను ఎన్డీఏలోకి తీసుకురావడం వల్ల కూటమిలో అంతర్గత సమతుల్యత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గాల మధ్య సయోధ్య సాధ్యమవుతుందా? అన్నదే అసలు సవాల్‌గా మారనుంది.
కేంద్ర కేబినెట్ ఆశలు.. అజిత్ వర్గం ఎదురుచూపులు
ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర స్థాయిలో మరింత ప్రాధాన్యత కోసం ఎదురుచూస్తోంది. భవిష్యత్ కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తమ పార్టీకి ప్రాతినిధ్యం రావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పార్థ్ పవార్‌కు కేంద్ర కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉందని తెలుస్తోంది.
ఆమె ఖండించినా.. కొనసాగుతున్న ప్రచారం
మరోవైపు శరద్ పవార్ వర్గం మాత్రం ఎన్డీఏలో చేరే ప్రచారాన్ని ఖండిస్తోంది. NCP(SP) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ఇలాంటి వార్తలను పలుమార్లు తోసిపుచ్చారు. తనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోందని, అలాంటి ఊహాగానాల్లో వాస్తవం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే పార్లమెంట్ లెక్కలు, రాబోయే రాజకీయ పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ వర్గం ప్రాధాన్యతను కొట్టిపారేయలేమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్‌సభలో NCP(SP)కు ఉన్న ఎనిమిది మంది ఎంపీల సంఖ్య కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ లెక్కలు కొత్త దిశలో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. పవార్ కుటుంబంలో మళ్లీ ఐక్యత వస్తుందా? ఎన్సీపీ పునరేకీకరణ జరుగుతుందా? లేక ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.


