బీజేపీ మిషన్ 360.. మోదీ మాస్టర్ ప్లాన్‌కు కౌంట్‌డౌన్ | Is the NDA 6 MPs short of a two thirds majority | Sakshi
Sakshi News home page

బీజేపీ మిషన్ 360.. మోదీ మాస్టర్ ప్లాన్‌కు కౌంట్‌డౌన్

Jul 16 2026 8:07 PM | Updated on Jul 16 2026 8:18 PM

 Is the NDA 6 MPs short of a two thirds majority
  • పార్లమెంట్‌ ముందుకు రానున్న ముఖ్యమైన బిల్లులు
  • మొత్తం 360 మంది ఎంపీల మద్దతు అవసరం
  • ఇంకా ఆరుగురు ఎంపీల మద్దతు కావాలి
  • అందుకు మోదీ ఏం చేస్తున్నారు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకుముందు బీజేపీ తన 'మిషన్ 360' ప్రయత్నాలను వేగవంతం చేసింది. నరేంద్ర మోదీ సర్కార్ మహిళలకు రిజర్వేషన్, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు అంశాలను ఒకదానితో ఒకటి అనుసంధానించాలనే ఆలోచనలో ఉంది. ఏప్రిల్‌లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అవసరమైన రెండు వంతుల మెజారిటీ లభించలేదు. దీంతో మరోసారి ప్రయత్నించే ముందు మద్దతు పెంచుకునే చర్యలను ఎన్డీఏ ముమ్మరం చేసింది.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ సారి సర్కార్‌కు అనుకూలంగా ఉండొచ్చని బీజేపీ భావిస్తోంది. పార్లమెంట్‌లో తన బలాన్ని పెంచుకునే లక్ష్యంతో అధికార పార్టీ విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమావేశాలకు ముందు చర్చలు వేగవంతం చేశాయి.

తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), శరద్ పవార్ వర్గంలో ఇటీవల ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నా, రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన రెండు వంతుల మెజారిటీకి బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇంకా దాదాపు ఆరుగురు ఎంపీల మద్దతును సంపాదింకోవాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపాదిత బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నం సర్కార్ చేస్తుందా అన్న అంశంపై రాజకీయ పరిశీలకులు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో జులై 19న బీజేపీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

బీజేపీ వ్యూహాలు
వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ అంతర్గత చర్చలను వేగవంతం చేసింది. గత వారం రోజులుగా పార్టీ అగ్రనేతలు పలు కీలక సమావేశాలు నిర్వహించారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ హాజరయ్యారు.

వర్షాకాల సమావేశాల్లో సర్కార్ అనుసరించాల్సిన పార్లమెంటరీ వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అదే సమయంలో బి.ఎల్. సంతోష్ హాజరు కావడంతో నితిన్ నబీన్ నాయకత్వంలో కొత్త జాతీయ బృందాన్ని బీజేపీ త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సంస్థాగత స్థాయిలో విస్తృత సంప్రదింపులు కొనసాగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి పదవులకు తగిన నాయకుల పేర్లను కోరారు. వచ్చిన సిఫార్సుల ఆధారంగా కొత్త బృందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశం సంస్థాగత అంశాలకే పరిమితం కాలేదు. సర్కార్ శాసన కార్యక్రమం, ప్రతిపక్షాల వ్యూహం, సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశమున్న బిల్లులపై కూడా చర్చ జరిగింది. వాటిలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలపైనే ఎక్కువ చర్చ సాగింది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనుకూలమే!
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంతో పోలిస్తే మరింత అనుకూలంగా ఉన్నాయని సర్కార్ భావిస్తోంది. అధికార కూటమి బలమైన స్థితిలో ఉండగా, ప్రతిపక్షం తక్కువ బలంతో కనిపిస్తోందని అంచనా వేస్తోంది. పలు ప్రాంతీయ పార్టీల వైఖరి కీలకంగా మారే అవకాశం ఉంది. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే కొన్ని అంశాల్లో సర్కార్‌కు మద్దతు ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపిన వివరాల ప్రకారం.. కీలక అంశాల్లో డీఎంకే వైఖరి కాంగ్రెస్‌ వైఖరితో భిన్నంగా ఉండొచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని, సభలో విడిగా కూర్చోవాలని డీఎంకే నిర్ణయించినట్టు సమాచారం. దీనితో అంశాల వారీగా డీఎంకే మద్దతు లభిస్తుందన్న ఆశలను బీజేపీ పెంచుకుంది.

ప్రస్తుతం ఉన్న 3 ఖాళీల కారణంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య 540గా ఉంది. రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు అవసరం.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఎన్డీఏకు దాదాపు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన ఎన్‌సీపీఐకి చెందిన 20 మంది ఎంపీలు, డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు లభిస్తే ఆ సంఖ్య దాదాపు 335కు చేరొచ్చు. మరికొన్ని పార్టీల నుంచి మరో 5 కలుపుకుని మద్దతు దాదాపు 340కు చేరుతుందని అంచనా.

మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరినట్టు వస్తున్న సమాచారంతో ఎన్డీఏ బలం దాదాపు 346కు చేరే అవకాశం ఉంది. 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ పార్టీ కూడా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వంటి రాజ్యాంగ సవరణకు మద్దతు ఇస్తే, కూటమి సంఖ్య దాదాపు 354కు చేరుతుంది. అయినా రెండు వంతుల మెజారిటీకి ఇంకా ఆరుగురు ఎంపీలు తక్కువగానే ఉంటారు.

చివరి ఆరుగురు ఎంపీల మద్దతు ఎలా సాధిస్తుంది?
రెండు వంతుల మెజారిటీ దాటాలంటే ఎన్‌డీఏకు ఇంకా ఆరుగురు ఎంపీల మద్దతు అవసరం. ఈ పరిస్థితుల్లో హోంమంత్రి అమిత్ షా వరుస రాజకీయ సమావేశాలు నిర్వహించారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, వర్షాకాల సమావేశాలకు ముందు బీజేపీ తన సంఖ్యాబలాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగానే బీజేపీ పలు పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోంది.

మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు షరతులతో మద్దతు ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంకేతాలు ఇచ్చారు. అయితే ఆయన పార్టీ పెట్టిన షరతులను సర్కార్ అంగీకరించే అవకాశం తక్కువని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement