ఒడిశా: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. రథయాత్రలో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 120మందికి గాయాలైనట్లు తెలుస్తోంది.
ఒడిశా టీవీ కథనాల ప్రకారం..పూరీ జగన్నాథ రథయాత్రలో 10లక్షల మంది భక్తులు హాజరయ్యారు. అయితే, గర్భగుడి నుంచి రథం వద్దకు దేవతామూర్తులను తీసుకొస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆ సమయంలో విపరీతమైన భక్తుల రద్దీతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో భక్తులకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు.
రథాలవైపు భక్తులు తోసుకుంటూ వచ్చారు. పలువురు గాయపడ్డారు. పరిస్థితి మరింత అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి అత్యవసర ప్రత్యేక సహాయ బృందాలు రంగంలోకి దిగారు. అస్వస్థతకు గురైన భక్తుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, గతేడాది వార్షిక రథయాత్ర సందర్భంగా శ్రీ గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.


