ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూసే పూరీ జగన్నాథ మహారథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ గర్భాలయం నుంచి బయటకు వచ్చి రథాలను అధిరోహించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోగా.. మరోవైపు రథయాత్ర వేళ ఇస్కాన్‌పై పూరీ జగన్నాథ ఆలయ పరిపాలన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి.
శాస్త్రాలకు విరుద్ధంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా రథయాత్రలు నిర్వహిస్తూ భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని పూరీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) ఇస్కాన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల ఇస్కాన్ విడుదల చేసిన ప్రకటనల్లో వాస్తవాలు లేవని, తాము నిర్వహిస్తున్న రథయాత్రలు పూర్తిగా శాస్త్రసమ్మతమేనని చెప్పడం సరికాదని స్పష్టం చేసింది.
ఈ అంశంపై ఇప్పటికే ఇరు వర్గాల పండితుల మధ్య చర్చలు జరిగినప్పటికీ.. ఇస్కాన్ వాదనలను శాస్త్రాలు, పురాణాల ఆధారంగా తిరస్కరించామని వెల్లడించింది. అంతేకాదు.. పూరీ గజపతి మహారాజు దిబ్యసింహ దేవ్ తమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం కూడా పూర్తిగా అసత్యమని పేర్కొంది.
అయితే పూరీ ఆలయ యంత్రాంగం ఆరోపణలపై ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిష్ఠిర్ గోవింద దాస్ స్పందిస్తూ.. ఆలయ ప్రకటనను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని, దానిని చూసిన తర్వాతే తమ వైఖరిని వెల్లడిస్తామని తెలిపారు.
VIDEO | Puri, Odisha: Sand artist Sudarsan Pattnaik creates 100 miniature raths to mark the annual Jagannath Rath Yatra.#Puri #JagannathRathYatra
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/WZGhiRLLKF— Press Trust of India (@PTI_News) July 16, 2026
ఇదిలా ఉండగా.. మహారథయాత్ర కోసం మూడు భారీ రథాలు ఇప్పటికే పూరీ ఆలయ సింహద్వారం వద్ద సిద్ధంగా నిలిచాయి. జగన్నాథుడి నందిఘోష, బలభద్రుడి తాళధ్వజ, సుభద్రమ్మ దర్పదళన రథాలను సంప్రదాయ పూజల అనంతరం గ్రాండ్ రోడ్డుపైకి తీసుకొచ్చారు. రథయాత్ర సందర్భంగా ఆలయ ప్రాంగణం, బడదండా (గ్రాండ్ రోడ్) భక్తులతో కిక్కిరిసిపోయింది.
రథయాత్ర విశిష్టతను వివరిస్తూ ఓ మహిళా భక్తురాలు చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. "సాధారణ రోజుల్లో మేమే ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటాం. కానీ రథయాత్ర రోజున మాత్రం స్వామివారే బయటకు వచ్చి మమ్మల్ని దర్శిస్తారు. అందుకే ఈ రోజు ఎంతో ప్రత్యేకం" అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
#WATCH | Puri, Odisha | A devotee says, "...On normal days, we visit the temple to see the Lord, but today, He is coming out to see us. That is why we have come..." https://t.co/IvPIcRsACf pic.twitter.com/m6kMWASTzo
— ANI (@ANI) July 16, 2026
లక్షలాది మంది భక్తులు హాజరవుతుండటంతో ఒడిశా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.
పూరీతో పాటు దేశంలోని పలు నగరాల్లో కూడా ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్రలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రథయాత్రల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఒకవైపు భక్తిశ్రద్ధలతో జగన్నాథ మహారథయాత్ర ప్రారంభమవుతుండగా.. మరోవైపు రథయాత్ర నిర్వహణపై పూరీ ఆలయం, ఇస్కాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కూడా ఈసారి ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.


