అహ్వాజ్: ఇరాన్‌లోని అహ్వాజ్‌లో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణులు దాడి చేశాయని, ఫలితంగా ఆస్పత్రిలోని రోగులను అత్యవసరంగా తరలించాల్సి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులు, ముఖ్యంగా కీమోథెరపీ తీసుకుంటున్న చిన్నారులను భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 24 గంటల వ్యవధిలో ఇరాన్‌పై అమెరికా రెండు భారీ దాడులను చేసింది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ సైనిక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. అహ్వాజ్‌తో పాటు బందర్ అబ్బాస్, చబహార్, బుషెహర్ నగరాల్లోనూ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
అలాగే ఇరాన్ ఓడరేవుల వద్ద నిబంధనలను ఉల్లంఘించి వస్తున్న ‘ఎం/టి బెల్మా’ అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా యుద్ధ విమానాలు క్షిపణులతో దెబ్బతీశాయి. ఈ దాడుల వల్ల ఆస్పత్రికి జరిగిన నష్టం లేదా ప్రాణనష్టంపై ఎటువంటి అధికారిక సమాచారం అందలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.


