దుబాయ్: హార్మూజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ వైమానిక దాడులకు దిగుతుండడం పట్ల అమెరికా రగిలిపోతోంది. ప్రతీకారంగా బుధవారం ఇరాన్ ఓడరేవును దిగ్బంధించింది. ఇరాన్ సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. కనీసం ఏడుగురు సైనికులు మరణించారు. 260 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. హార్మూజ్ జలసంధిలో వ్యూహాత్మక ప్రాంతమైన గ్రేటర్ తున్బ్ ఐలాండ్‌పై అమెరికా దాడులు చేసింది. 1971లో ఇరాన్ అప్పటి యూఏఈ నుంచి అబూ మూసా, గ్రేటర్ తున్బ్, లెసర్ తున్బ్ అనే మూడు ద్వీపాలను ఆక్రమించింది.
వాటిని తిరిగి స్వా«దీనం చేసుకోవడానికి యూఏఈ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఆ మూడు దీవులను అమెరికా స్వాదీనం చేసుకుంటే హార్మూజ్‌పై పట్టు చిక్కినట్లేనని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో ఇరాన్‌పై మరిన్ని దాడులు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం రాత్రి స్పష్టంచేశారు. అమెరికా కనీసం 13 క్షిపణులు ప్రయోగించిందని, ఏడుగురు జవాన్లు మరణించారని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్ తెలియజేసింది. నాలుగైదు రోజులుగా అమెరికా సైన్యం సాగిస్తున్న దాడుల్లో కనీసం 35 మంది మరణించారని, 300 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. గల్ఫ్‌లో అమెరికా మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దళాలు మోహరించి ఉన్న మూడు దేశాలపై దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
గల్లంతైన భారత నావికుడు మృతి
హార్మూజ్ జలసంధితో ఇరాన్ వైమానిక దాడిలో గల్లంతైన భారతీయ నావికుడు విగతజీవిగా మారాడు. ఒమన్ తీరంలో సైప్రస్ జెండాతో కూడిన జీఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌకపై ఈ నెల 12న ఇరాన్ సైన్యం దాడికి దిగింది. నౌకలోని 10 మంది భారతీయులు క్షేమంగా బయటపడగా, ఒకరు గల్లంతయ్యారు. బాధితుడిని మహారాష్ట్రలోని పుణేకు చెందిన 30 ఏళ్ల మెరైన్ ఇంజనీర్ హేరంభ్ కర్మార్కర్‌గా గుర్తించారు. అతడు మరణించినట్లు తాజాగా నిర్ధారించారు. ఈ సంఘటన పట్ల దుబాయ్‌లోని భారత కాన్సులేట్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. హేరంభ్ కుటుంబానికి సహాయం అందించేందుకు యూఏఈ అధికారులు, షిప్పింగ్ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. హేరంభ్ భౌతికకాయం కోసం ఎదురు చూస్తున్నామని హేరంభ్ బంధువు వివేక్ బుధవారం చెప్పారు. మృతదేహాన్ని త్వరగా పంపించే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కర్మార్కర్‌కు భార్య, తల్లి, సోదరి ఉన్నారు.


