అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష దాడులు కొనసాగుతున్నాయి. వెస్ట్ వ్యాలీ సిటీలోని వ్యాలీ ఫెయిర్ మాల్‌లో పనిచేస్తున్న భారతీయ ముస్లిం ఉద్యోగిపై పీటర్ మైఖేల్ లార్సెన్ (48) అనే అమెరికన్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సదరు ఉద్యోగిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
బాధితుడిని సొహైల్‌గా పోలీసులు గుర్తించారు. దాడి అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని సాల్ట్ లేక్ కౌంటీ జైలులో ఉంచారు. బాధితుడు ముస్లిం కావడమే వల్ల దాడిచేసినట్లు పీటర్ మైఖేల్ లార్సెన్ పోలీసుల విచారణలో ఒప్పుకొన్నాడు. ఈ ఘటన సోమవారం జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దారుణం జరిగిందిలా..
సోహైల్ వ్యాలీ ఫెయిర్ మాల్‌లోని ఓ షాప్‌లో పనిచేస్తున్నాడు. అయితే సోమవారం మధ్యాహ్న సమయంలో సోహైల్ వద్దఉ పీటర్ మైఖేల్ లార్సెన్ వచ్చాడు. నిందితుడు మొదట సొహైల్ పేరు అడిగి, ఆపై అతని మతం గురించి అడిగాడు. ఆ తర్వాత తాగడానికి మంచినీళ్ల బాటిల్ కావాలని కోరాడు.
నిందితుడి మాటలు నమ్మిన సొహైల్.. నీళ్ల బాటిల్ తీసుకోవడానికి వెనక్కి తిరగడమే ఆలస్యం, లార్సెన్ తన వద్ద ఉన్న కత్తితో అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు. దాదాపు 15 సార్లు కత్తితో బలంగా పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే మాల్ లోని కొంతమంది వ్యక్తులు ప్రాణాలకు తెగించి మరి నిందితుడని కిందకు పడేసి గట్టిగా పట్టుకున్నారు. దీంతో సోహైల్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.


