కర్ణాటకలోని ధార్వాడ్‌లో బుధవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాకోట్రి ప్రాంతంలో అనస్థీషియాలజిస్ట్ కిరణ్ హోనన్నవర్(45)ను గుర్తుతెలియని దుండగులు తన అపార్ట్‌మెంట్‌లోనే అత్యంత కిరాకతంగా హత్య చేశారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు సైతం తీవ్రమైన కత్తిపోట్లకు గురయ్యాడు.
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, ఆప్తమాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ ఘటన జరిగిన అపార్ట్‌మెంట్ అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉంది.
మా ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లభించలేదు. ఆ సమయంలో ఇంట్లో కేవలం డాక్టర్ కిరణ్, ఆయన భార్య ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు" అని పేర్కొన్నారు.
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..
కాగా డాక్టర్ కిరణ్ బంధువులు ఆయనకు వరుసగా ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రియాంకకు ఫోన్ చేశారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి బంధువులు నేరుగా అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.
అక్కడికి వచ్చి చూడగా ఒక గదిలో డాక్టర్ కిరణ్ మృతదేహం, మరో గదిలో గాయపడిన బాలుడు పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు. ఆమె పోలీసులకు కూడా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కిరణ్ కుటంబ సభ్యులు మాత్రం డాక్టర్ ప్రియాంకనే ఈ హత్యకు ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు.


