కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో బీసీ నేతల కీలక భేటీ | Jajula Srinivas Goud Invites Karnataka CM DK Shivakumar to National OBC Convention | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో బీసీ నేతల కీలక భేటీ

Jul 14 2026 12:31 AM | Updated on Jul 14 2026 12:31 AM

Jajula Srinivas Goud Invites Karnataka CM DK Shivakumar to National OBC Convention

దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన తరగతుల (బీసీ) హక్కుల సాధన కోసం మరో చారిత్రాత్మక పోరాటానికి బెంగళూరు నగరం వేదిక కాబోతోంది. వచ్చే నెల ఆగస్టు 7వ తేదీన బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో  "11వ అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభ"ను నిర్వహించనున్నారు. 

ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఆహ్వానించింది. బెంగళూరులోని కృష్ణా హౌస్‌లో కర్ణాటక పీసీసీ అధ్యక్షులు బికె హరి ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో పలు రాష్ట్రాలకు చెందిన 15 మంది కీలక ఓబీసీ నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాల తరపున చొరవ తీసుకోవాలని ఆయన సీఎంను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా గత పదేళ్లుగా ఢిల్లీ, ముంబై, నాగపూర్, హైదరాబాద్, అమృత్‌సర్, గోవా వంటి నగరాల్లో విజయవంతంగా మహాసభలు నిర్వహించి బీసీలను ఏకం చేశామని, అదే స్ఫూర్తితో ఈసారి 11వ మహాసభను బెంగళూరులో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

నేనున్నా.. బీసీలకు సీఎం డీకే శివకుమార్ అభయం
బీసీ నేతల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అత్యంత సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా బీసీల డిమాండ్లను పరిష్కరించేందుకు ఒక ముఖ్యమంత్రిగా, అలాగే కర్ణాటక ప్రభుత్వం తరపున తన వంతు సంపూర్ణ మద్దతు ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. 

ఇంతటి ప్రతిష్టాత్మక జాతీయ ఓబీసీ మహాసభ ఈ ఏడాది తమ రాష్ట్రంలో జరగడం అభినందనీయమని పేర్కొంటూ, ఈ సభకు తాను తప్పకుండా హాజరవుతానని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement