బెంగళూరు: కుమారుడిపై ఉన్న కేసునే తండ్రిపైనా ఎలా నమోదు చేస్తారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివరాలు.. మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణ కుమారుడైన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో రేవణ్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి నిందితునిగా చేర్చారు. దీనిని రేవణ్ణ హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే ఒక సెక్షన్‌ను తొలగించింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ‘ఇద్దరిపై భిన్నమైన ఆరోపణలున్నాయి. కానీ ఒకే కేసుగా భావించి.. కొడుకుపై ఉన్న కేసునే తండ్రిపై ఎలా నమోదు చేస్తారు. చట్టంలో ఈ అవకాశం ఉందా? దౌర్జన్యం కేసును రద్దు చేసి.. లైంగిక దాడి కేసుగా విచారించాలని ఆదేశించడం ఔచిత్యమేనా?’ అని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయడంలో చేసిన జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి.. విచారణను వాయిదా వేసింది.


