టికెట్ ధరల బాదుడుపై కోర్టు సీరియస్! | Supreme Court Seeks Centre New Aviation Rules To Regulate Airfares And Protect Passenger Rights | Sakshi
Sakshi News home page

టికెట్ ధరల బాదుడుపై కోర్టు సీరియస్!

Jul 14 2026 8:47 AM | Updated on Jul 14 2026 10:32 AM

supreme-court-secret-report-airfare-rules

విమాన చార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక అడుగు వేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు విధిస్తున్న ఏకపక్ష చార్జీల పెంపునకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన కొత్త విమానయాన నిబంధనలను రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

రెండు వారాల్లోగా నివేదిక

జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన నియంత్రణ, ప్రయాణికులపై విధిస్తున్న అదనపు భారాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధనల ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ‘సీల్డ్ కవర్’ (రహస్య పత్రం) రూపంలో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ.. ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ కింద నిబంధనల రూపకల్పన ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం వాటి అధికారిక అనువాద ప్రక్రియ జరుగుతోందని అది ముగియగానే పార్లమెంటు ముందు ఉంచుతామని ధర్మాసనానికి వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పార్లమెంటు ఆమోదం కంటే ముందే కోర్టు పరిశీలన కోసం వాటిని అందజేయాలని ఆదేశించింది.

చార్జీల దోపిడీపై కోర్టు ఆందోళన

పండుగలు, ప్రత్యేక సెలవులు, కుంభమేళా వంటి భారీ ఈవెంట్ల సమయంలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమాన చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయని (డైనమిక్ ప్రైసింగ్), ఇది ప్రయాణికులను తీవ్రంగా దోపిడీ చేయడమేనని గత విచారణల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు, మహాకుంభ్ సమయంలో భోపాల్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో వన్-వే విమాన చార్జీలు ఏకంగా 498 శాతం పెరిగి రూ.2,977 నుంచి రూ.17,796కి చేరిన విషయాన్ని పిటిషన్‌లో ‍ప్రస్తావించారు.

పారదర్శకతలేని విధానాలు

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ విమాన చార్జీలు, లగేజీ రుసుములు, ఇతర అనుబంధ చార్జీలను నియంత్రించడానికి స్పష్టమైన చట్టబద్ధమైన అధికార సంస్థ లేకపోవడం వల్లే ఎయిర్‌లైన్స్ పారదర్శకత లేని విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఉచిత చెక్ఇన్ బ్యాగేజీ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించి, అదనపు లగేజీపై భారీగా వసూలు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కేవలం అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.

కొత్త చట్టం - నిబంధనల అవశ్యకత

బ్రిటిష్ కాలం నాటి ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్, 1934’ స్థానంలో సివిల్ ఏవియేషన్ రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. అయితే, దీని పరిధిలో ప్రయాణికుల రక్షణ, ధరల నియంత్రణకు సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు ఇంకా నోటిఫై కాలేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం విమాన చార్జీలు పూర్తిగా మార్కెట్ శక్తుల ఆధారంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు భావిస్తోంది.

ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement