డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో.. కస్టమర్ల ఫిర్యాదులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్ల సమస్యలకు బ్యాంకుల స్థాయిలోనే న్యాయమైన, శాశ్వత పరిష్కారం లభించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. కస్టమర్ ఫిర్యాదులను అర్థవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ అంతర్గత అంబుడ్స్‌మెన్‌లను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలోనే పరిష్కారం..
ఒక కస్టమర్ బ్యాంకు సేవలపై అసంతృప్తితో ఫిర్యాదు చేసినప్పుడు ఆ సంస్థ దానిని తిరస్కరిస్తే ఆటోమేటిక్‌గా అది అంతర్గత అంబుడ్స్‌మెన్ పరిశీలనకు వెళ్తుంది. అయితే, చాలా సందర్భాల్లో ఈ ఫిర్యాదులు సరిగ్గా పరిష్కారంకాక ఆర్‌బీఐ అంబుడ్స్‌మెన్ స్థాయికి చేరుకుంటున్నాయి. దీనివల్ల కేంద్ర బ్యాంకుపై అదనపు భారం పడుతోంది. ఈ ఎస్కలేషన్లను తగ్గించడమే ఆర్‌బీఐ తాజా ఆదేశాల ఉద్దేశం. సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరిస్తే కస్టమర్లకు సమయం కలిసిరావడంతో పాటు బ్యాంకులపై నమ్మకం పెరుగుతుందని ఆర్‌బీఐ భావిస్తోంది.
‘బ్యాంకులు నియమించే అంతర్గత అంబుడ్స్‌మెన్‌లు కేవలం సాంకేతిక నిబంధనలను చూపి కస్టమర్ల ఫిర్యాదులను తోసిపుచ్చకూడదు. వారు బ్యాంక్ యాజమాన్య ఒత్తిళ్లకు లొంగకుండా ఒక స్వతంత్ర న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మానవీయ కోణంలో కస్టమర్ వైపు ఉన్న న్యాయాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి’ అని స్వామినాథన్ చెప్పారు.
ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది?


