క్యూ1లో రూ. 4,624 కోట్లు... ఆదాయం 14 శాతం వృద్ధి;
రూ. 34,579 కోట్లు షేరుకు రూ. 12 మధ్యంతర డివిడెండ్
ఆదాయ వృద్ధి అంచనా 1–4 శాతం
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో రూ.4,624 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,843 కోట్లతో పోలిస్తే 20 శాతం జంప్ చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ.34,579 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 30,349 కోట్లుగా నమోదైంది.
సీక్వెన్షియల్‌గానూ పెరుగుదల...
గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (క్యూ4)లో నమోదైన రూ. 4,488 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో లాభం 3% పెరిగింది. ఆదాయం 1.8% వృద్ధి చెందింది.
స్థిరంగా గైడెన్స్...
2026–27 పూర్తి ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) హెచ్‌సీఎల్ టెక్ స్థిరంగా కొనసాగించింది. గైడెన్స్ 1–4% ఉండొచ్చని పేర్కొంది. సేవల విభాగం ఆదాయం 1.5–4.5% వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది.
ఇతర ముఖ్యాంశాలు..
→ వాటాదారులకు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి ఈ నెల 17 రికార్డు తేదీ కాగా, 27న చెల్లిస్తుంది.
→ ఈ ఏడాది మార్చి ఆఖరితో పోలిస్తే జూన్ చివరి నాటికి 3,292 మంది ఉద్యోగులు తగ్గారు. మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,889కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు 12.7 శాతంగా నమోదైంది. కాగా, క్యూ1లో 1,056 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. మార్చి క్వార్టర్‌లో 1,712 మంది ఫ్రెషర్లతో పోలిస్తే జాబ్ ఆఫర్స్ తగ్గాయి.
కంపెనీ షేరు 5 శాతం జంప్ చేసి, రూ.1,221 వద్ద ముగిసింది.
ఏఐ డేటా సెంటర్లపై రూ. 3,500 కోట్ల పెట్టుబడి
భారత్‌లో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.3,500 కోట్ల మేర పెట్టుబడులు వెచ్చించేందుకు హెచ్‌సీఎల్ టెక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్ల కోసం నెలకొల్పే కొత్త అనుబంధ సంస్థల ద్వారా ఈ నిధులను ఇన్వెస్ట్ చేయనుంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఏఐ ఆధారిత సరీ్వసులు, సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో వ్యాపారావకాశాలను దక్కించుకోవడం కోసం ఫుల్–స్ట్యాక్ ఏఐ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.
‘50 మెగావాట్ల సామర్థ్యం వరకు విస్తరించేలా ఏఐ డేటా సెంటర్లపై రూ.3,500 కోట్ల మేర వ్యూహాత్మక పెట్టుబడులు పెడతాం. ఏఐ డేటా సెంటర్ డిజైన్, ఏఐ క్లౌడ్ కార్యకలాపాలతో పాటు మా సాఫ్ట్‌వేర్ పోర్ట్‌ఫోలియోల్లో కంపెనీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాలకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ తోడ్పాటునందిస్తుంది. తద్వారా పూర్తిస్థాయి సమగ్ర సేవలకు వీలవుతుంది’ అని హెచ్‌సీఎల్‌టెక్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో
ఆర్టీఫిషియల్ (ఏఐ) మార్పులు చోటుచేసుకుంటున్నాయి, ఈ కొత్త వృద్ధి అవకాశాలను కంపెనీ అందిపుచ్చుకుంటోంది. మా వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో క్లయింట్లకు టెక్నాలజీపరంగా వ్యాపార వ్యూహాలను రూపొందించుకోవడంలో తోడ్పడుతున్నాం. వర్ధమాన సాంకేతికతల్లో మా ఉద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు సంస్థలో ఏఐని అమలు చేస్తున్నాం.
– రోష్ని నాడార్ మల్హోత్రా, హెచ్‌సీఎల్ టెక్ చైర్‌పర్సన్
క్యూ1లో కంపెనీ
చరిత్రలోనే అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల కొత్త ఆర్డర్లను దక్కించుకున్నాం. అడ్వాన్స్‌డ్ ఏఐ వ్యాపారం సీక్వెన్షియల్‌గా 10.6 శాతం, వార్షికంగా 62.1 శాతం చొప్పున ఎగబాకింది. క్లయింట్లు మా ఏఐ సేవల్ని ఎంచుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం. నిర్వహణ సామర్థ్యంతో పాటు మార్జిన్ల వృద్ధి దన్నుతో మధ్యకాలికంగా మార్కెట్ వృద్ధిని మించి రాణించగలమన్న నమ్మకం కలుగుతోంది.
– సి. విజయకుమార్, హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ


