కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్‌లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగింది?
హెచ్‌సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
సీన్ కట్ చేస్తే..
సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.
ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు..


