appraisal
-
డ్యాన్స్ చేస్తున్న సీఈవో.. షాకిచ్చిన టెకీ!
కార్పొరేట్ వేడుకలు అంటేనే అట్టహాసాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులు, సంగీతం, డ్యాన్స్‌లతో సందడిగా ఉంటాయి. కానీ, ఎంత పెద్ద వేడుక జరిగినా సగటు ఐటీ ఉద్యోగి ఆలోచన మాత్రం ఎప్పుడూ 'అప్రైజల్స్' (జీతాల పెంపు) చుట్టూనే తిరుగుతుంటుందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) 50వ వార్షికోత్సవ వేడుకల్లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగింది?హెచ్‌సీఎల్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కంపెనీ సీఈవో సి. విజయకుమార్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికపైకి వచ్చి ఉద్యోగులను పలకరించడమే కాకుండా, వారితో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. సీఈవో డ్యాన్స్ చూసి ఉద్యోగులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ప్రజ్వల్ భాటియా అనే ఉద్యోగి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.సీన్ కట్ చేస్తే.. సీఈవో విజయకుమార్ పాటలకు అనుగుణంగా చిందులేస్తూ, ప్రేక్షకులతో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఊహించని మలుపు ఎదురైంది. వందలది ఉన్న ఆ గుంపులో నుంచి ఒక ఉద్యోగి గట్టిగా.. "సార్, అప్రైజల్ కబ్ హోగా? (సార్, మా అప్రైజల్స్ ఎప్పుడిస్తారు?) అంటూ అరిచాడు. సరిగ్గా మ్యూజిక్ ఆగిన సమయంలో వచ్చిన ఈ ప్రశ్నతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఆపై వెంటనే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. వేడుకలప్పుడు కూడా సీఈవోకు అప్రైజల్ సెగ తగలడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "కంపెనీ ఎంత పెద్ద వేడుకలు చేసినా, ఉద్యోగికి కావాల్సింది జీతం పెంపు మాత్రమే. ఆ యువకుడు అందరి మనసులో మాట అడిగాడు" అని కొందరు కామెంట్ చేశారు. సాధారణంగా సీఈవోలతో మాట్లాడాలంటేనే ఉద్యోగులు భయపడతారని, కానీ ఇలాంటి వేదికపై నిర్మొహమాటంగా ప్రశ్న అడగడం ఆ ఉద్యోగి ధైర్యానికి నిదర్శనమని మరికొందరు మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ వేడుకల కోసం రూ.కోట్లు ఖర్చు చేసే కంపెనీలు, ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కూడా అంతే ఉదారంగా ఉండాలని ఇంకొంత మంది విమర్శలు చేశారు.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. View this post on Instagram A post shared by Prajjwal Bhatia (@prajjwal_bhatia) -
భారీగా ఉద్యోగులపై వేటువేస్తున్నవిప్రో
న్యూఢిల్లీ: దేశంలోని మూడవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో కూడా ఉద్యోగులపై భారీగా వేటు వేయనుంది. వార్షిక "పనితీరు అంచనా" లో భాగంగా వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించింది. సుమారు 600 మంది ని ఇంటికి పంపించనుంది. అయితే ఈ సంఖ్యంగా మరింత పెరిగనుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సంఖ్య 2వేలమంది కంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై స్పందించిన విప్రో రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే ఈ తొలగింపులని పేర్కొంది. తన క్లయింట్ రిక్వైర్మెంట్స్, సంస్థ వ్యూహాత్మక ప్రాధాన్యతలను బట్టి ఉద్యోగులను క్రమబద్ధీకరించే క్రమంలో "కఠినమైన పనితీరును అంచనా వేసే ప్రక్రియ" నిర్వహిస్తామని తెలిపింది. ఈసమగ్రమైన పనితీరు అంచనా ప్రక్రియలో ఉద్యోగుల మార్గదర్శకత్వం, పునః శిక్షణ, అప్ స్కిల్లింగ్ కూడా ఉంటుందని చెప్పింది. అలాగే సంస్థ నుంచి కొందరు ఉద్యోగులపై వేటుకు దారితీయవచ్చని ఈ సంఖ్య సంవత్సర సంవత్సరానికి మారుతూ ఉంటుందని తెలిపింది. అయితే ఎంతమందిని తొలగించిందీ స్పష్టం చేయలేదు. కాగా డిసెంబరు 2016 చివరి నాటికి, బెంగళూరుకు చెందిన కంపెనీకి 1.79 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ 25 న నాలుగవ త్రైమాసిక ఫలితాలను కంపెనీ ప్రకటించనుంది. -
కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత!
6,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం బెంగళూరు: వ్యాపార పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తడబడుతున్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 2.3 శాతం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్ పే అవుట్‌పైనా గణనీయమైన ప్రభావం పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏటా మార్చిలో ముగిసే వార్షిక పనితీరు మదింపు కార్యక్రమంలో భాగంగా పనితీరు ఆశాజనకంగా లేని దిగువ స్థాయిలో ఉన్న ఒక శాతం ఉద్యోగులను తొలగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని... ఈ ఏడాది ఇంతకంటే ఎక్కువ మందినే ఉద్యోగాల నుంచి తప్పించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఉద్యోగుల తొలగింపు 1–2 శాతం మధ్యలో ఉండగా, రెండేళ్ల క్రితం మాత్రం కేవలం ఒక శాతంగానే ఉంది. కాగ్నిజెంట్‌కు 2016 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు 2,60,200. వీరిలో 72 శాతం అంటే 1,88,000 మంది బారత్‌లో పనిచేస్తున్న వారే. అయితే, దేశీయంగా ఎంత మంది ఉద్యోగులను తొలగించేదీ, ఏ ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత రాలేదు. అయితే, ఆటోమేషన్ కారణంగా అవసరం లేని దిగువ స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్టు కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. ‘‘క్లయింట్ల అవసరాలకు, మా వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్లో సరైన నైపుణ్యాలు ఉండేలా చూసేందుకు క్రమం తప్పకుండా పనితీరును సమీక్షిస్తుంటాం. దీనివల్ల కొంత మంది ఉద్యోగులు కంపెనీని వీడాల్సి రావచ్చు’’ అని కాగ్నిజెంట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగ్నిజెంట్ ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తుండగా, గతేడాది మాత్రం ఇది 8.6 శాతానికే పరిమితమైంది. -
ఇక ‘మదింపు’లో అక్రమాలకు చెక్
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 37 మున్సిపాలిటీల్లో ఈనెల 20వ తేదీ నుంచి ఇంటింటి సర్వే చేయడానికి మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఏఎస్) తో శాటిలైట్ ద్వారా మున్సిపల్ పట్టణాల మ్యాప్ తీస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఆస్తి పన్ను మదింపు చేపడితే ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా ఎంత ఉండాలో అంతే ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీల్లో రెవెన్యూ విభాగం అధికారులు, బిల్ కలెక్టర్లు ఇష్టారాజ్యంగా ఆస్తి పన్ను వసూలు చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు పాల్పడి మున్సిపల్ ఖజానాకు భారీగానే గండి కొట్టారనే సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది. అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలోని 8 మున్సిపాలిటీల్లో ఇటీవల పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు వార్డుల చొప్పున జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా సర్వే చేపట్టారు. దాంతో అక్కడ దాదాపు 80 శాతం ఆస్తిపన్ను తక్కువగా ఉన్నట్లు తేలింది. దాంతో ప్రభుత్వం రాష్ట్రంలోని పాత మున్సిపాలిటీ పట్టణాల్లో ఈ తరహా సర్వే చేపట్టి అక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 20 వరకు.. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, భునగిరి, సూర్యాపేట మున్సిపల్ పట్టణాల్లో కొత్తగా ఆస్తి పన్ను మదింపు చేపట్టనున్నారు. ఈనెల 20 నుంచి ఈ నాలుగు పట్టణాల్లో సర్వే ప్రారంభించడానికి మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. మూడు నెలల్లో సర్వే పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 20 వరకు సర్వే చేసి అదే నెల 30వ తేదీన స్పెషల్ నోటీసులు జారీ చేస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. సర్వే ఇలా.. మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను మదింపులో అక్రమాలను అరికట్టేందుకు సర్వే పకడ్బందీగా నిర్వహించనున్నారు. మదింపు కోసం చేపట్టాల్సిన వివరాలతో పట్టిక పత్రాలను తయారు చేసి ఇళ్లు, వాణిజ్య భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే కో సం విద్యార్థులను పెట్టుకోవాలని నిర్ణయించారు. అధికారులు ఇచ్చిన పత్రాల లో వివరాలు సేకరించిన వాటిని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో పొందుపరుస్తారు. శాటిలైట్ ద్వారా తీసే మ్యాప్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థుల ద్వారా చేపట్టే ఈ సర్వేకు బిల్ కలెక్టర్లు సూపర్వైజర్లుగా వ్యవహరిస్తారు. ఎంత పన్ను ఉంటే అంతే.. పట్టణాల్లో ఆస్తిపన్ను మదింపులో అనేక అక్రమాలు జరిగాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించి తక్కువ ఆస్తి పన్ను విధించి మున్సిపాలిటీ ఖజానాకు నష్టం జరిగే విధంగా వ్యవహరించారు. ఇక నుంచి ఇలాంటివి జరుగకుండా ఎంత ఆస్తి పన్ను ఉందో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా కచ్చితంగా అంతే రానుంది. ఎక్కడ వాణిజ్య భవనం ఉంటే దానికి తగ్గ పన్ను విధిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ము న్సిపాలిటీలకు ఆదాయం సమగ్రంగా సమకూరనుంది. జిల్లాలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న ఆస్తిపన్ను ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు లెక్కలు వేస్తున్నారు.


