హెచ్‌సీఎల్‌ టెక్‌ ఓకే | HCLTech Q4 Results: Profit climbs 4 Percentage to Rs 4488 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఎల్‌ టెక్‌ ఓకే

Apr 22 2026 2:12 AM | Updated on Apr 22 2026 2:15 AM

HCLTech Q4 Results: Profit climbs 4 Percentage to Rs 4488 crore

క్యూ4 లాభం రూ. 4,488 కోట్లు 

షేరుకి రూ. 24 డివిడెండ్‌ 

ఆదాయ అంచనాలు గుడ్‌

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 4 శాతం వృద్ధితో రూ. 4,488 కోట్లను తాకింది. ఇందుకు ఏఐ ఆధారిత సర్వీసులు పుంజుకోవడం దోహదపడింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 4,307 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 33,981 కోట్లకు చేరింది.

అంతక్రితం క్యూ4లో రూ. 30,246 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. త్రైమాసికవారీగా నికర లాభం 10 శాతం మెరుగుపడగా, ఆదాయం నామమాత్ర వృద్ధిని అందుకుంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 24 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. ఇందుకు మే 4 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. 

1–4 శాతం వృద్ధి 
అత్యంత అనిశ్చిత డిమాండ్‌ వాతావరణంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో ఆదాయం 1–4 శాతం మధ్య వృద్ధి చూపగలదని హెచ్‌సీఎల్‌ టెక్‌ తాజా అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. టారిఫ్‌ల ప్రభావం, విచక్షణాధారిత వ్యయాలు తగ్గడంతోపాటు ఇద్దరు క్లయింట్ల నుంచి కాంట్రాక్టులలో సమస్యలు వంటి అంశాలు ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది.  

పూర్తి ఏడాదికి డీలా 
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హెచ్‌సీఎల్‌ టెక్‌ నికర లాభం 4% నీరసించి రూ. 16,642 కోట్లను తాకింది. 2024–25లో రూ. 17,390 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం పుంజుకుని రూ. 1,30,144 కోట్లకు చేరింది. గతేడాది అనిశ్చిత పరిస్థితులు డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్‌ వెల్లడించారు.

కొన్ని బిజినెస్‌ విభాగాలు నెమ్మదించడంతో పనితీరులో అంచనాలను అందుకోలేకపోయామని తెలియజేశారు. ఇందుకు క్లయింట్ల విచక్షణాధారిత వ్యయాలు తగ్గడం, నిర్ణయాలలో ఆలస్యం కారణమైనట్లు పేర్కొన్నారు. క్యూ4లో అడ్వాన్స్‌డ్‌ ఏఐ ఆదాయం 15.5 కోట్ల డాలర్లను తాకినట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2026–27)లో ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా వి లువను సృష్టించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. 

మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించింది. కంపెనీ షేరు 1% లాభంతో రూ.1,442 వద్ద ముగిసింది.

ఇతర విశేషాలు...
 ఏఐ ప్రభావంతో 10 కోట్ల డాలర్ల విలువైన డీల్‌ను 8 కోట్ల డాలర్లకే కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఏఐతో ఆదాయం పుంజుకోనున్నట్లు భావిస్తోంది. 
 క్యూ4లో 193.6 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ కుదుర్చుకుంది. పూర్తి ఏడాదికి 932.3 కోట్ల డాలర్లకు మొత్తం కాంట్రాక్టుల విలువ చేరింది. 

నికరంగా 802 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,27,181ను తాకింది. క్యూ4లో 1,712 మంది ఫ్రెషర్స్‌కు చోటిచ్చింది. దీంతో ఈ సంఖ్య గతేడాదికి 11,744కు చేరింది.  
 పశ్చిమాసియా ప్రభావం తక్కువేనని ఆదాయంలో ఈ ప్రాంత వాటా 1 శాతమేనని కంపెనీ వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement