99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్‌మా సంచలన వ్యాఖ్యలు | 99 PC People Have No Future What Jack Ma meant and why it matters today | Sakshi
Sakshi News home page

99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్‌మా సంచలన వ్యాఖ్యలు

Apr 21 2026 12:50 PM | Updated on Apr 21 2026 1:17 PM

99 PC People Have No Future What Jack Ma meant and why it matters today

అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా యువత నుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  రష్యాలోని అత్యంత ప్రతిభావంతులైన కొందరు యువతను ఉద్దేశించి రష్యాలోని లోమోనోసోవ్ మాస్కో స్టేట్ యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం ఇపుడు నెట్టింట ఆందోళనకరంగా మారింది. అయితే భయపడకండి, ఆశాజనకంగా ఉండండి సమస్యల పరిష్కారంలో భాగస్వాములవ్వండి!  అంటూ ఒక సవాలును యువత ముందుంచడమే ఆయన వ్యాఖ్యల్లోని అంతరార్థం.  ఇంతకీ ఆ ట్విస్ట్‌ ఏంటి? ఆయన వ్యాఖ్యల అర్థం పరమార్థం ఏంటి?

జాక్‌ మా సందేశం
యూనివర్శిటీలోని మేధావులతో జాక్‌ మాట్లాడుతూ “ప్రపంచంలోని 99.9శాతం మందికి భవిష్యత్తు లేదు” అన్న వ్యాఖ్యలతో అక్కడున్నవారంతా ఉలిక్కి పడ్డారు. అత్యంత తెలివైన, సమర్థులైన యువత భయానికి, నిరాశకు లొంగిపోతే, ప్రపంచాన్ని రక్షించడానికి  ఎవరు ముందుకొస్తారన్న జాక్‌ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘మాస్కో యూనివర్శిటీకి చెందిన మీరు కూడా సమస్యలను పరిష్కరించలేకపోతే, మీరే భయపడితే.. ఇక ప్రపంచంలోని 99.9% మందికి భవిష్యత్తు ఉండదు.” అని అన్నారు. వెంటనే వారికి ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా చూపించారు. 

తెలివైన, సమర్థులైన యువతే భయపడి చేతులు ముడుచుకు కూర్చుంటే, ఇక ప్రపంచాన్ని రక్షించే వారెవరూ ఉండరు. అందుకే సమస్యలొస్తాయని భయపడటం మానేసి, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని పిలుపు నిచ్చారు.సానుకూలంగా ఉండాలని, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ శక్తిని వృథా చేసుకోవద్దని యువ మేధావులకు సూచించారు. భయపడుతూ ఆలోచిస్తూ కూర్చోకుండా, పని మొదలుపెట్టాలని చెప్పారు. ఆందోళన చెందితే, మకో అవకాశమేదీ ఉండదు. భయం నుండి కార్యాచరణకు మారడమే గొప్ప విజయం అని పేర్కొన్నారు.  

 నిజానికి ప్రపంచంలోని ప్రతి ఆందోళన  ఒక అవకాశమే అన్నారు. యంత్రాల వల్ల ఉద్యోగాలు కోల్పోతామని ప్రజలు భయపడితే, మార్పు గురించి ఆందోళన చెందితే ఫలితం లేదు. నిజానికి అది పూరించాల్సిన ఖాళీ. విద్యావంతులైన, సమర్థులైన యువత చేయాల్సిన పని ఈ ఆందోళనల నుండి దాక్కోవడం కాదు, వాటి వద్దకు నేరుగా వెళ్లి, వాటిని అర్థం చేసుకుని, పరిష్కారాలను  గుర్తించడం. కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసుకోవడం. సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించడం మొదలుపెడితే ప్రపంచ భవిష్యత్తును మార్చవచ్చు అని జాక్‌మా  సూచించడం విశేషం.
 

 

Advertisement
 
Advertisement
Advertisement