కేరళంలోని త్రిస్సూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తిరువంబడి డివిజన్‌కు చెందిన బాణసంచా ముడిసరుకులను నిల్వ ఉంచే ముండతికొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి వినిపించినట్లు తెలిసింది. పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్‌ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా, అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం.

కొనసాగుతున్నసహాయక చర్యలు
అగ్నిమాపక సిబ్బంది మంటలనార్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద స్థలానికి దారితీసే రహదారులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక, సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి.
గాయపడిన వారిని త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రితో సహా సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరికీ నిపుణుల వైద్య సంరక్షణ అందేలా చూడాలని ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. 108 అత్యవసర సేవల అంబులెన్స్‌లతో సహా, తగినన్ని అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపాలని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె ఆదేశించారు.


