ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్‌ నినో’ | Super El nino to Grip the World What You Need to Know About This Climate Shift | Sakshi
Sakshi News home page

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్‌ నినో’

Apr 21 2026 11:09 AM | Updated on Apr 21 2026 12:12 PM

Super El nino to Grip the World What You Need to Know About This Climate Shift

మన చుట్టూ ఉన్న పర్యావరణంలో అతి త్వరలో ఊహకందని పెను మార్పులు చోటుచేసు​కోబోతున్నాయా? దాదాపు 150 ఏళ్ల క్రితం ప్రపంచ జనాభాలో కోట్లాది మందిని బలితీసుకున్న ఆ ‘చీకటి రోజులు’ మళ్లీ రాబోతున్నాయా? అవునంటున్నాయి.. వాతావరణ శాస్త్రవేత్తల తాజా హెచ్చరికలు. ఈ ఏడాది (2026)లో సంభవిచబోయే ‘సూపర్ ఎల్‌ నినో’ కేవలం ఉష్ణోగ్రతలను పెంచడమే కాదు, గ్లోబల్ ఎకానమీని కూడా కుదిపేసే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ ఈ ముప్పును ఎలా ఎదుర్కోబోతోంది? పసిఫిక్ సముద్రపు అలల వెనుక దాగి ఉన్న ఆ నిగూఢ వాతావరణ రహస్యాలపై ప్రత్యేక విశ్లేషణ..

ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మాన్ (Ryan Maue) 2026లో అత్యంత శక్తివంతమైన ‘ఎల్‌ నినో’ (El Niño) ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని 1877లో సంభవించిన భయంకరమైన ఎల్‌ నినోతో పోలుస్తున్నారు. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా కరువుకాటకాలు వచ్చి, సుమారు మూడు నుండి 4 శాతం జనాభా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజా విశ్లేషణల ప్రకారం 2026లో కూడా అలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది.

ఎల్‌ నినో అంటే ఏమిటి?
ఎల్‌ నినో అనేది పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కే ప్రక్రియ. దీనివల్ల ప్రపంచవ్యాప్త గాలి దిశలు, వర్షపాత పద్ధతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. సాధారణంగా ఎల్‌ నినో సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షాలు తగ్గి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ఏప్రిల్ 2026 నివేదిక ప్రకారం, ప్రస్తుతం తటస్థంగా ఉన్న పరిస్థితులు మే-జూలై నాటికి ఎల్‌ నినోగా మారే అవకాశం 61 శాతం మేరకు కనిపిస్తున్నాయి.

2026 అంచనాలు: రికార్డు స్థాయి వేడి
ప్రస్తుత అంచనా వివరాల ప్రకారం ఈసారి ఎల్‌ నినో తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం (25 శాతం) వరకు ఉంది. అక్టోబర్ 2026 నాటి ఉష్ణోగ్రతల మ్యాప్‌లను గమనిస్తే, ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలో (Northern Hemisphere) సగటు కంటే ఎక్కువ వేడి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పంటలపై, వాతావరణంపై తీవ్ర ప్రభావం పడి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది.

1877- 2026 మధ్య వ్యత్యాసం
1877-78 కాలంలో వచ్చిన ఎల్‌ నినో సమయంలో సరైన సాగునీటి సౌకర్యాలు, వాతావరణ ముందస్తు హెచ్చరికలు లేకపోవడం వల్ల కోట్లాది మంది ఆకలితో మరణించారు. అయితే 2026లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండనుంది. ఆధునిక నీటిపారుదల వ్యవస్థలు, వాతావరణాన్ని తట్టుకునే విత్తన రకాలు, ప్రభుత్వాల అప్రమత్తత వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం చాలా తక్కువ. 1877లో జరిగింది.. మానవ తప్పిదాల వల్ల సంభవించిన విపత్తు అయితే, 2026లో వాతావరణ పరమైన సవాళ్లు ప్రపంచాన్ని వెంటాడనున్నాయి.

భారతదేశంలో ఏం జరగనుంది?
భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి వర్షాధారిత ప్రాంతాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మెరుగైన సాగునీటి ప్రాజెక్టులు ఉండటం వల్ల కొంత ఊరట లభించనుంది. ఎల్‌ నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడితే ఆహార ధరలు పెరగడం, గ్రామీణ పరపతి రంగంపై ఒత్తిడి పడటం వంటి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ ఎండాకాలం చాల డేంజర్, ప్రమాదంలో భారత్..

 

 ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ నినో కేవలం ఆహార సంక్షోభమే కాకుండా, విపరీతమైన హీట్‌వేవ్‌లు (వడగాల్పులు), తుపానులు, ఆకస్మిక వరదలకు కారణం కావచ్చు. ఇది గ్లోబల్ సప్లై చైన్‌పై ప్రభావం చూపి, ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. ఏదిఏమైనప్పటికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాలు ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని, ఆకలి చావుల వంటివి సంభవించే అవకాశం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్‌లో హై టెన్షన్

Advertisement
 
Advertisement
Advertisement