భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను ఇవాళ (జూన్ 6) తొలగించారు. కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి కూడా అతడికి ఉద్వాసన పలికారు. కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ పేరును ప్రకటించారు.
త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లతో పాటు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల కోసం మూడు వేర్వేరు భారత జట్లను ఎంపిక చేశారు. ఈ మూడు జట్లలో స్కైకు చోటు లభించలేదు. తనపై వేటు పడిన తర్వాత కూడా హుందాగా వ్యవహరించి, కొత్తగా ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన స్కై.. వేటు పడిన గంటల వ్యవధిలో బ్యాట్‌తో ఫైరయ్యాడు.
టీ20 ముంబై లీగ్‌లో భాగంగా సోబో ముంబై ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రాత్రి) 24 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి (ట్రయంప్ నైట్స్ ఎంఎన్‌ఈ కెప్టెన్‌గా) వీరంగం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో స్కై ప్రత్యర్ది జట్టులో కొత్తగా ఎంపికై భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉండటం మరో విశేషం. మ్యాచ్‌కు ముందు స్కై శ్రేయస్‌ను హత్తుకొని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ చూడచక్కని దృశ్యం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
ముంబై టీ20 లీగ్ మ్యాచ్ విషయానికొస్తే.. సూర్య ఔటయ్యాక అతడి జట్టు గాడి తప్పింది. 19 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. స్కై క్రీజ్‌లో ఉన్నంతసేపు అతడి జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు.
తీరా చూస్తే వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్ కూడా చేసేలా కనిపించడం లేదు. ప్రత్యర్ది జట్టు బౌలర్లలో ప్రథమేశ్ డాకే 3, యశ్ డిచోల్కర్ 2, సిద్దార్థ్ రౌత్, వేదాంత్ గోరే తలో వికెట్ తీసి స్కై జట్టును దెబ్బకొట్టారు. స్కై జట్టులో అతడితో పాటు అఖిల్ హెర్వాద్కర్ (12), నూతన్ కుమార్ గోయెల్ (34), మకరంద్ గిరీశ్ పాటిల్ (11) మాత్రమే అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగలిగారు.


