నారికేళంతో నయన సంరక్షణ..! | Beauty Tips: Ways to Care for the Skin Around Your Eyes | Sakshi
Sakshi News home page

నారికేళంతో నయన సంరక్షణ..!

Jun 7 2026 8:37 AM | Updated on Jun 7 2026 8:39 AM

Beauty Tips: Ways to Care for the Skin Around Your Eyes

సౌందర్య రంగంలోకి కూడా ఏఐ అడుగుపెట్టింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ హెచ్‌–హెచ్‌ సంస్థ కంటి కింద వచ్చే నల్లటి వలయాలు, ముడతలను తగ్గించడానికి హైపర్‌ రిజువనేటింగ్‌ ఐ ప్యాచ్‌ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ప్రతిష్ఠాత్మక ‘సీఈఎస్‌– 2026’ వేదికపై బ్యూటీ టెక్‌ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.

సాధారణంగా మార్కెట్లో దొరికే ఐ ప్యాచ్‌లు లేదా ముఖం మొత్తానికి వాడే ఎల్‌ఈడీ మాస్క్‌ల కంటే ఈ హైపర్‌ రిజువనేటింగ్‌ ఐ ప్యాచ్‌ ఎంతో భిన్నమైనది. ఇందులో అమర్చిన అధునాతన మల్టీ–మోడల్‌ ఏఐ సిస్టమ్, వినియోగదారుల చర్మతత్త్వాన్ని లోతుగా విశ్లేషించి, డిజిటల్‌ డేటాను తయారు చేస్తుంది. 

ఈ డేటా ఆధారంగా, లోపల ఉన్న ఫ్లెక్సిబుల్‌ ఎల్‌ఈడీ ప్యాచ్‌లు ఆ వ్యక్తి చర్మానికి ఎంత మేరకు కాంతి అవసరమో అంత మేరకు మాత్రమే కాంతిని అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేస్తాయి. ఇది చర్మ కణాలను లోపలి నుంచి ఉత్తేజపరచేందుకు తోడ్పడుతుంది. 

ఈ పరికరం వాడేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేని టెక్నాలజీతో రూపొందించడం వల్ల, దీనిని కంటి కింద ధరించి తమ రోజువారీ పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా చేసుకోవచ్చు. ఇది చర్మానికి అవసరమైన పోషకాలను కణాల స్థాయి వరకు చేరవేస్తూ, ప్రతి ఒక్కరి చర్మ తత్వానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన సంరక్షణను అందిస్తుంది.

బీరుతో కురుల రక్షణ
బీరు పురాతన పానీయం. బీరును పానీయంగానే కాదు, కురుల సంరక్షణ కోసం కూడా పురాతన కాలంలో ఉపయోగించేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్‌ నాగరికతల కాలంలో బీరుతో కురులను బాగా రుద్ది శుభ్రం చేసుకునేవారు. ఇప్పుడు కూడా చాలామంది బీరును కేశసంరక్షణ కోసం వాడుతున్నారు. 

‘బీర్‌ రిన్స్‌’ పేరుతో బీరుతో తలస్నానాలు చేస్తున్నారు. ముందుగా షాంపూతో తలస్నానం చేశాక, బీరుతో కురులను శుభ్రం చేసుకుంటున్నారు. బీరులోని విటమిన్‌–బి కాంప్లెక్స్‌ సహా పోషకాలు జుట్టును ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ఇవి జుట్టుకు సహజమైన నిగారింపునిస్తాయి.

నారికేళంతో నయగారం
మన వంటింట్లో ఉండే వాటితోనే ముఖాన్ని మెరిపించవచ్చు. వాటిల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార లేదా కాఫీ పొడి కలిపి చర్మానికి రుద్దితే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. స్నానం చేసిన తర్వాత ఒంటికి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం పొడిబారకుండా, మెరుస్తూ ఉంటుంది. 

రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ పెదవులకు కొబ్బరి నూనె రాస్తే పెదవులు పగలకుండా ఉంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడానికి రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో కళ్ల చుట్టూ మృదువుగా మసాజ్‌ చేస్తే ఫలితం ఉంటుంది. ముఖానికి ఉన్న మేకప్‌ను సులభంగా తీసేయడానికి కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను దూదితో ముఖానికి రాసి తుడిచేస్తే మేకప్‌ అంతా తొలగిపోతుంది.  

(చదవండి: పేరెంటింగ్‌ క్లాసులో చేరాలి..!)

Advertisement
 
Advertisement
Advertisement