ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. టోలెడో నగరంలోని ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుండగా, గుర్తుతెలియని ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు..అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
పండుగ వేళ బుల్లెట్ల వర్షం
ఓహియోలో ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ జరుగుతుండగా కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రక్తపు మడుగులో పలువురు క్షతగాత్రులు కనిపించారు. ఈ ఘటనపై నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ స్పందిస్తూ.. ఈ కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల అనంతరం ఎవరో గన్‌ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.
నిందితుడి కోసం ముమ్మర గాలింపు
ఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితుని కోసం టోలెడో పోలీస్ డిపార్ట్‌మెంట్ ముమ్మరంగా గాలిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోలీసులు స్పందిస్తూ.. డెలావేర్ అవెన్యూ, రాబిన్‌వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.
‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’
ఈ ఉదంతంపై ఓహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి ఉత్సవాలు అనేవి సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి చోట్ల హింస చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: ‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!


