గల్ఫ్‌లో మళ్లీ యుద్ధమేఘాలు | War clouds loom again in the Gulf | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌లో మళ్లీ యుద్ధమేఘాలు

Jul 25 2026 2:08 AM | Updated on Jul 25 2026 2:08 AM

War clouds loom again in the Gulf

జూన్‌ 17, 2026న ఇరాన్‌–యూఎస్‌ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్‌ గల్ఫ్‌లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్‌ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.

దిక్కుతోచని అమెరికా 
ఇరాన్‌–యూఎస్‌ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్‌ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్‌ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్‌ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్‌ నిర్దేశాలు జారీ చేసింది. 

ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్‌ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్‌ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్‌ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్‌ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్‌ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్‌ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్‌ తీరానికి సమీపంలో ఒమన్‌ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్‌ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్‌ దాడి చేయటంతో యూఎస్‌ఏ తన నౌకాబలంతో హార్మూజ్‌ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై దాడులు ప్రారంభించింది.

మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్‌లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్‌ ప్లాంట్లు, డీసాలినేషన్‌ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్‌లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్‌ క్రైమ్‌) కిందకు వస్తుంది. ఇరాన్‌ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్‌లోని అల్‌సుబియా డీసాలినేషన్‌ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్‌ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్‌లలోని యూఎస్‌ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. 

అవగాహన పత్రంపై ట్రంప్‌ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్‌ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్‌కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్‌ హార్మూజ్‌ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.

ఇరు పక్షాలకూ నష్టమే!
ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్‌ హెగ్‌సెత్‌ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్‌ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్‌పై దాడి వలన అమెరికన్‌ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్‌ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్‌ డాలర్ల నిధులను కోరుతున్నది.

తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్‌ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్‌ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్‌ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. 

ఇక ఇరాన్‌ విషయానికొస్తే, ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్‌ కరెన్సీ (రియల్‌) దారుణంగా పతనమయింది. ఒక డాలర్‌కు 1.32 మిలియన్ల రియల్స్‌ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్‌ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్‌ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే,  అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు రాజకీయంగా ఇరాన్‌ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్‌ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్‌ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్‌–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.

కొత్త గుణపాఠాలు
హార్మూజ్, బాబెల్‌ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్‌ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్‌ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్‌–వెస్ట్‌ పైప్‌ లైన్‌ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్‌ బారల్స్‌ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్‌కు మద్దతునిచ్చే యెమెన్‌లోని హౌతీలు బాబెల్‌ మాండెబ్‌ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్‌ నుండి పైప్‌లైన్‌ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్‌ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్‌ ఫుజేరాపై దాడి చేసింది. 

భారత్‌ ప్రతిపాదించిన ‘ఐమెక్‌’(ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌– యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్‌ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్‌ కారియర్లు, స్టెల్త్‌ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్‌ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. 

ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్‌ వెనుక అమెరికా, యూరప్‌ ఉన్నాయి. ఇరాన్‌ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్‌ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్‌ దేశాల రక్షణను ఇజ్రాయెల్‌ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్‌ విధానాల నుండి నేర్చుకోవచ్చును.

-వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌); సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు
-గురజాల శ్రీనివాసరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement