పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్‌లో హై టెన్షన్ | Armys Stern Warning Ahead of Pahalgam Attack Anniversary | Sakshi
Sakshi News home page

పహల్గామ్ దాడికి ఏడాది: కశ్మీర్‌లో హై టెన్షన్

Apr 21 2026 9:59 AM | Updated on Apr 21 2026 10:03 AM

Armys Stern Warning Ahead of Pahalgam Attack Anniversary

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి జరిగి రేపటితో (ఏప్రిల్ 22) సరిగ్గా ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో భారత సైన్యం అత్యంత ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. ‘మానవత్వపు హద్దులు దాటినప్పుడు, మా స్పందన నిర్ణయాత్మకంగా ఉంటుంది. న్యాయం జరిగింది. భారతదేశం ఐక్యంగా నిలబడుతుంది’ అని ‘ఎక్స్’ వేదికగా ఆర్మీ చేసిన తాజా పోస్ట్ వైరల్‌గా మారింది. ఉగ్ర మూకలకు స్పష్టమైన హెచ్చరికలు పంపుతూనే, దేశ భద్రత పట్ల ఆర్మీ తన ఉక్కు సంకల్పాన్ని మరోసారి చాటిచెప్పింది.

ఆ నెత్తుటి జ్ఞాపకం..
2025 ఏప్రిల్ 22న అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ సమీపంలోని ‘మినీ స్విట్జర్లాండ్’గా ప్రసిద్ధి చెందిన బైసరన్ వద్ద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దారుణ మారణకాండలో 25 మంది పర్యాటకులతో పాటు ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన  యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ముందస్తు జాగ్రత్తగా జమ్మూకశ్మీర్‌లోని 44 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలు తెరుచుకున్నప్పటికీ, బైసరన్‌తో పాటు మరో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన చందన్‌వాడి ఇప్పటికీ మూసివేసే ఉన్నాయి. వీటిని ఎప్పుడు తెరుస్తారనే దానిపై స్పష్టత లేదు.
 

కశ్మీర్ లోయలో కట్టుదిట్టమైన భద్రత
ఉగ్రదాడి ప్రథమ వార్షికోత్సవం సమీపించడంతో కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. సాధారణ ప్రజల్లో ఎలాంటి భయాందోళనలు కలగకుండానే, వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్త చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అడ్డుకునేందుకు ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కశ్మీర్ వ్యాప్తంగా ప్రస్తుతం డేగకన్నుతో నిఘా కొనసాగుతోంది.

రంగంలోకి ఉన్నతాధికారులు
వివిధ జిల్లాల్లో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామాలో డీఐజీ జావేద్ ఇక్బాల్ మట్టూ నేతృత్వంలో నేరాలు, భద్రతపై కీలక సమీక్ష జరిగింది. ఉగ్రవాద కట్టడి చర్యలు, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదేవిధంగా అవంతిపొరా, శ్రీనగర్‌లలో ఎస్ఎస్‌పీ జి.వి సందీప్ చక్రవర్తి శాంతిభద్రతలను సమీక్షించారు. ముఖ్యంగా దర్యాప్తులను వేగవంతం చేసి, నేరస్తులకు శిక్ష పడే శాతాన్ని పెంచడంపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించారు.

ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంతో అదిరిపోయే డీల్.. భారత్‌కు బహుళ ప్రయోజనం!

Advertisement
 
Advertisement
Advertisement