‘స్త్రీలకు స్త్రీల ఆసరా ఎప్పుడూ అవసరమే! వాళ్ళు పరస్పరం ద్వేషించుకునేందుకే, ఒకరితో ఒకరు స్నేహం చేస్తుంటారు. అలా ఒకర్నొకరు ద్వేషించుకునే క్రమంలోనే వారిమధ్య ఏదో బంధం పెనవేసుకుంటుంది!’ అన్న మాటలు ఏ స్త్రీద్వేషో అన్నవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 2009లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న జెర్మన్ రచయిత్రి హెర్తా మ్యూల అన్న మాటలివి.
‘అసలు, మృత్యువుతో తలపడడానికి ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితమేం అవసరం లేదు– ఇంకా ముగింపునకు రాని చిన్నపాటి బతుకు చాల’ని కూడా అన్నారు హెర్తా. ఆమె శైలి గురించి చెప్తూ, అది ‘కవిత్వంలోని చిక్కదనంతోనూ, వచనంలోని సూటిదనంతోనూ నిండివుంటుంద’ని స్వీడిష్ ఎకాడెమీ నిపుణులు ఎందుకన్నారో ఇలాంటి మాటలు వింటే అర్థమైపోతుంది. పరాయిచోట్ల తమ మూలభాషనే మాట్లాడుతూ మనుగడ సాగించే జాతి– ప్రజాతుల భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. (ఇది తెలుగుతో సహా అన్ని భాషలకూ వర్తిస్తుంది.
ఏమైనా సందేహం ఉంటే, పక్కనే వున్న తమిళనాట్లో తెలుగులు మాట్లాడే భాష వింటే అలాంటి సంశయాలు నిర్మూలమై పోతాయి!) కాఫ్కా తన రచనల్లో వాడిన జెర్మన్ లాంటి భాషనే, హెర్తా మ్యూల సైతం వాడుక చేశారని స్వీడిష్ ఎకాడెమీ పెద్దలు వ్యాఖ్యానించారు.
ఇది ప్రశంసా కాదు– అభిశంసా కాదు! ఉన్నది వున్నట్లు చెప్పినమాట మాత్రమే!! ఎటొచ్చీ, కాఫ్కా 40 యేళ్ళపాటు చెక్ రాజధాని ప్రాగ్ నగరంలో బతికాడు– హెర్తా 34 యేళ్ళపాటు రొమానియాలో మనుగడ సాగించారు. అంతే! మనదేశంతో పాటే విదేశీ పాలన కాడి బరువు వదిలించుకున్న దేశాల్లో రొమానియా కూడా ఒకటి. 1947లోనే – నాజీలను మినహాయించి– అఖిలపక్ష జాతీయ ప్రభుత్వం అక్కడ ఏర్పాటయింది. కానీ, మొదటినుంచీ, రొమానియాలో సోవియెట్ పెత్తనం కొనసాగుతూనే వచ్చింది.
‘ఇంక, ఇదేం స్వాతంత్య్రం మహాశయా?’ అని గొంతెత్తి ప్రశ్నించిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు అక్కడి పాలకులు. ఆ దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న జెర్మన్లలో– హెర్తా తండ్రి మాదిరిగా– నాజీ సైన్యంలో పనిచేసినవారూ కొందరున్నారు. వాళ్ళలో వీలైనంతమందిని విరగడ చేసుకున్నారు పాలకులు. మిగిలిన స్త్రీ– శిశు– వృద్ధులను నిర్బంధ శ్రామిక క్షేత్రాలకు తరలించారు. వారి శ్రమఫలాన్ని ‘రొమానియా స్వాతంత్య్ర పోరాటానికైన ఖర్చులకు మింజుమిలె’ జమకట్టుకున్నారు ధర్మప్రభువులు! ఇదే కథను ఇతివృత్తంగా చేసుకుని హెర్తా 2009 లో ‘ఆకలి దేవత’ (ద హంగర్ ఏంజెల్) అనే నవల రాశారు. అదే సంవత్సరం ఆమెకి నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ!
వాస్తవానికి అప్పటికి 27 సంవత్సరాలుగా హెర్తా సృజనాత్మక రచనలు చేస్తూనే వున్నారు. 1982లో ఆమె తొలి కాల్పనిక రచన, ‘న్యాదిర్స్’ (అధోలోకాలు) వెలువడింది. రొమానియన్ గ్రామీణ జీవనంలోని చీకటి కోణాలను విమర్శనాత్మకంగా చిత్రించిన అధిక్షేప రచన అది. పల్లెలో బతికే ఓ బాలుడి దృష్టికోణం నుంచి కథనం సాగడం ఇందులో చాలామందిని ఆకర్షించిన విషయం. ముఖచిత్రంపై బోదురుకప్ప బొమ్మతో వెలువడిన ఈ పుస్తకం ఆమెకి అభిమానులనూ, విమర్శకులనూ సమానంగా సంపాదించి పెట్టింది. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జెర్మనులు హెర్తా విమర్శను పూర్తిగా సమర్థించగా, సాంప్రదాయిక జెర్మనులు ఆమెని దుమ్మెత్తి పోశారు. కాగా, కమ్యూనిస్టు యువజన సంఘం ఈ రచనకు పురస్కారం ప్రకటించి నెత్తినపెట్టుకోవడం విశేషం.
హెర్తా మ్యూల 1994లో రాసిన ‘ఆకుపచ్చ పళ్ళతోట’ ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ రచనకు –జెర్మన్ భాషలో– హెర్తా పెట్టిన పేరు ‘హెర్జ్ టియర్.’ ఇది జెర్మన్ భాషలో వాడుకలో వున్న మాట కాదు– హెర్జ్(గుండెకాయ)+ టియర్ (జంతువు) అనే రెండు మాటల్ని కలిపి జంతుప్రవృత్తి అనే అర్థంలో ఈ మాటను సృష్టించారు హెర్తా. నికలాయ్ చౌషెస్క్యూ హయాంలో అణచివేతను తప్పించుకునే నిమిత్తం జెర్మనీకి పారిపోయిన నలుగురు యువజనుల కథ ఇది. వారిలో ఒకరుగా వున్న ఓ యువతి దృష్టికోణం నుంచి కథనం సాగుతుంది.
పాశవిక ప్రవృత్తి కలిగిన పాలకులు, పాలితుల ప్రవృత్తిలో సైతం ఒకింత పాశవికత చొరబడేలా చేస్తారన్నది కథకురాలి ధ్వని. ఈ నవలను ‘చౌషెస్క్యూ హయాంలో బలైపోయిన సహచరుల స్మృతికి’ అంకితం చేశారు హెర్తా. చేదు నిజాలను చెప్పేందుకు హెర్తా ఎన్నడూ వెనకాడలేదు– అందుకే, స్వదేశంలో పరాయిజనంగా బతికిన రొమానియన్ జెర్మన్లు, జెర్మనీ నడిగడ్డపైనా అదే ‘హోదా’ సంపాదించుకోగలిగారని అనడానికి ఆమె జంకలేదు! 1947లో స్వాతంత్య్రంతో పాటే మనజాతికి సంక్రమించిన దేశవిభజన సందర్భంగా, పాకిస్తాన్ తరలి వెళ్ళిన అమాయక ముసల్మానులు అక్కడ ముహాజిర్ హోదానే పొందారు. మన దేశంలోనే మిగిలిపోయిన వాళ్ళు బావుకున్నది మాత్రమేముందని? ఇది ఓ అంతర్జాతీయ విషాద కావ్యం అనొచ్చునేమో!
మందలపర్తి కిషోర్


