ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో స్థిరపడనున్నారని వచ్చిన వార్తలపై అల్లు అరవింద్ స్పందించారు. ఈ మేరకు అధికారికంగా డెక్కన్ క్రానికల్‌లో ఒక కథనం వచ్చింది. బన్నీ- అట్లీ మూవీ రాకా షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని నెట్టింట కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన తండ్రి అల్లు అరవింద్ డెక్కన్ క్రానికల్‌తో తెలిపారు. 'బన్నీ కొత్త సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ముంబైలో జరుపుకుంటున్నందున చాలామందికి అలా అనిపించవచ్చు. కానీ, అర్జున్ మనసు హైదరాబాద్ చుట్టే ఉంటుంది. అతనికి సొంత ఇల్లు ఇక్కడే ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. తన స్నేహితులందరూ హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తారు..? ముంబైలో స్థిరపడాలనే ప్రణాళికలు బన్నీకి లేవు. అయితే, ప్రస్తుతం షూటింగ్ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు.' అని అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో 'రాకా' సినిమా షూటింగ్ కోసం అల్లు అర్జున్ హైదరాబాద్, ముంబైల మధ్య ఎక్కువ రాకపోకలు సాగించే అవకాశం ఉంది. తెలుగు సినిమాకు మించి తన సూపర్‌స్టార్‌డమ్‌ను విస్తరించుకోవాలనే ప్రణాళికలు లేవని తెలుస్తోంది. టాలీవుడ్‌లోనే ఉంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్లాన్‌తో అల్లు అర్జున్ ఉన్నట్లు అర్థం అవుతుంది.


