సాక్షి, తిరుమల: తిరుమలలో ఓ మహిళ అదృశ్యం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సదరు మహిళను గుంటూరుకు చెందిన లక్ష్మీ తిరుపతమ్మగా గుర్తించారు. కాగా, ఆమెకు ఇటీవలే పెద్దలు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లి ఇష్టం లేక వెళ్లిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల మేరకు.. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) కుటుంబం సోమవారం తిరుమల దర్శనానికి వెళ్లారు. వీరంతా తిరుమలలో HVC 694-A గదిలో ఉన్నారు. అనంతరం, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మీ తిరుపతమ్మ గది నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఉదయం 7 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే ఆమెకు పెద్దలు వివాహం నిశ్చయించారు. అయితే, వివాహం ఇష్టం లేక తిరుపతమ్మ వెళ్లినట్లు అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఇక, స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సదరు మహిళను గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఫొటోను విడుదల చేశారు.


