‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ | A Year After Pahalgam Bloodbath Grieving Families Kashmirs Resurgence | Sakshi
Sakshi News home page

‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ

Apr 21 2026 12:33 PM | Updated on Apr 21 2026 12:41 PM

A Year After Pahalgam Bloodbath Grieving Families Kashmirs Resurgence

పహల్గామ్: సరిగ్గా ఏడాది క్రితం జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ నెత్తురోడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం పేరుతో 26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న ఆ చీకటి రోజును యావత్ దేశం ఇంకా మర్చిపోలేదు. ఆనాటి ఉగ్రదాడికి ఏప్రిల్ 22తో ఏడాది పూర్తవుతున్న తరుణంలో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. ఒకపక్క ఆత్మీయులను కోల్పోయిన ఆవేదన, మరోపక్క ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం వారిని మరింత కుంగదీస్తున్నాయి.

ఆఖరి శ్వాస వరకు వెంటాడే పీడకల
పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కౌస్తుభ్ గన్‌బోటే భార్య సంగీత మాట్లాడుతూ.. ఆ భయానక ఘటనను తన ఆఖరి శ్వాస వరకు మర్చిపోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులను చంపడం ద్వారా ఉగ్రవాదులు సాధించేదేమీ లేదని, ప్రభుత్వంతో పోరాటం ఉంటే నేరుగా వారితోనే తేల్చుకోవాలని ఆమె హితవు పలికారు. మరో బాధితురాలు ప్రియదర్శిని ఆచార్య (ప్రశాంత కుమార్ శత్పథి భార్య) తన భర్త లేని లోటును ప్రతీ రోజు తలచుకుంటున్నానని, ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి, ప్రస్తుతం తాత్కాలిక ఉద్యోగంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక సాయం అందినప్పటికీ, ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇంకా రాలేదని, ఆ మాట నిలబెట్టుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

‘ఆపరేషన్ సిందూర్’ పేరిట..
ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి మరీ దారుణ మారణకాండకు ఒడిగట్టారు. ఈ మారణహోమానికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు మే 7, 2025న ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్ గడ్డపైకి చొచ్చుకెళ్లాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది భారీ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్ర నష్టం వాటిల్లడంతో దిగివచ్చిన పాక్ ఆర్మీ.. భారత డీజీఎంఓను ఆశ్రయించి మే 10న కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది.

భయాలు వీడి.. మళ్లీ పర్యాటకుల రాక
కశ్మీర్ లోయలో ఇప్పుడు అనూహ్య మార్పు కనిపిస్తోంది. పహల్గామ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగింది. ఇది సందర్శకుల్లో తిరిగి చిగురించిన భద్రతా భావానికి అద్దం పడుతోంది. శ్రీనగర్‌ను సందర్శించిన విశాల్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ.. గతంలో జరిగిన దురదృష్టకర ఘటనల ఆధారంగా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయలేమని, కశ్మీర్ ఇప్పుడు అత్యంత సురక్షితమైన ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 51 క్వింటాళ్ల పూలతో కేదార్‌నాథ్ ముస్తాబు

Advertisement
 
Advertisement
Advertisement