లెన్స్‌కార్ట్ వివాదం : బీజేపీ మహిళా నేత హల్‌చల్ | This Is Hindu Nation BJP Leader Storms Lenskart Store Applies Tilak To Staff | Sakshi
Sakshi News home page

లెన్స్‌కార్ట్ వివాదం : బీజేపీ మహిళా నేత హల్‌చల్

Apr 21 2026 2:54 PM | Updated on Apr 21 2026 3:28 PM

 This Is  Hindu Nation BJP Leader Storms Lenskart Store Applies Tilak To Staff

సాక్షి, ముంబై: మతపరమైన భావప్రకటనా స్వేచ్ఛపై ప్రముఖ ఐవేర్ బ్రాండ్ 'లెన్స్‌కార్ట్' ఆంక్షల వివాదం నేపథ్యంలో ముస్లిం బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహి ఖాన్ హిందూ సంస్థల సభ్యులతో కలిసి హల్‌చల్‌ చేశారు. ముంబైలోని స్టోర్‌లలో ఒకదానిలోకి ఆమె దూసుకెళ్లారు. తిలకం దిద్ది, స్టోర్ మేనేజర్ మోహ్సిన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాలపై ఉన్న ఆంక్షల గురించి ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తమ ఉద్యోగుల కోసం  లెన్స్‌కార్ట్‌ జారీ చేసినట్లుగా చెబుతున్న ఒక డ్రెస్ కోడ్ పాలసీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. దీని ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో బొట్టు (బిందీ), తిలకం ధరించకూడదని ఆంక్షలు విధించినట్లు ఆరోపణలు వచ్చాయి.అదే సమయంలో, హిజాబ్ ధరించడానికి అనుమతి ఉన్నట్లు ప్రచారం జరిగింది. 

ఈ వివాదం నేపథ్యంలో, బీజేపీ నేతనాజియా ఇలాహి ఖాన్, హిందూ సంఘాల ప్రతినిధులతో కలిసి ముంబైలోని ఒక లెన్స్‌కార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారు.మతపరమైన చిహ్నాలను ధరించడానికి సిగ్గుపడకూడదని అక్కడ ఉన్న ఉద్యోగులకు చెప్పారు. అక్కడి సిబ్బందికి బలవంతంగా తిలకం దిద్ది, చేతులకు కంకణాలు (కాల్వా) కట్టారు. ఇది హిందూ దేశం. లెన్స్‌కార్ట్ యజమాని క్షమాపణ చెప్పకపోతే స్టోర్లను మూసివేస్తాం లేదంటే బహిష్కరిస్తామంటూ హెచ్చరించారు.

లెన్స్‌కార్ట్ వివరణ
సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత , 'బాయ్‌కాట్ లెన్స్‌కార్ట్'  తీవ్రం కావడంతో , లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. సర్క్యులేట్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం పాతదని, అది ప్రస్తుతం అమలులో లేదని ఆయన స్పష్టం చేశారు. తమ ఉద్యోగులు తమ మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ప్రతిబింబించే గుర్తులను (తిలకం, బిందీ, హిజాబ్, క్రాస్ మొదలైనవి) ధరించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ తన పొరపాటును సరిదిద్దుకున్నట్లు ప్రకటించినప్పటికీ,హిందూ సంప్రదాయాలను విస్మరిస్తూ ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించడంపై నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement