ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు | Minister Ponnam Prabhakar React On RTC Employees Strike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

Apr 21 2026 9:46 AM | Updated on Apr 21 2026 11:06 AM

Minister Ponnam Prabhakar React On RTC Employees Strike

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీసీని మూసివేసే పరిస్థితి నుంచి లాభాల బాటలో నడిచేలా చేసాం. నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నింటికి సమ్మె అనడం పరిష్కారం కాదంటూ హితవు పలికారు. సమ్మెకు వెళ్లి పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందిస్తూ..‘కబ్జాదారులకు మద్దతుగా ఉంటామని కేసీఆర్ ప్రకటించారు. మేము హైడ్రాతో ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుతున్నాం. మాకు పదేళ్లు అధికారం పక్కా. మేము పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అన్నట్లు ఉంది కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. రైతుభరోసా ఎప్పుడు వేయాలో మాకు తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ దృష్టి పెట్టింది.

కాగా, ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవ­లం ఒకేరోజు మిగిలి ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం ప్రయాణికుల్లో ఉత్కంఠ నెలకొంది. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సర్వీసు నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీలోని ఓ జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement