ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ | US Iran Peace Talks Hit a Wall as Trump Warns of Severe Consequences | Sakshi
Sakshi News home page

ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

Apr 21 2026 8:53 AM | Updated on Apr 21 2026 9:15 AM

US Iran Peace Talks Hit a Wall as Trump Warns of Severe Consequences

వాషింగ్టన్‌: ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు, మరోవైపు ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ మొండి పట్టుదలతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ముగియనున్న డెడ్ లైన్
ఇరు దేశాల మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగియనుంది. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్నప్పటికీ జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందాన్ని తదుపరి చర్చల కోసం పాకిస్తాన్‌కు పంపాలని ట్రంప్ యోచిస్తున్నారు. అయితే అమెరికా తన కఠిన వైఖరిని మార్చుకుంటే తప్ప తాము చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఇదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించే అవకాశం లేదని ట్రంప్ స్పష్టం చేయడం గమనార్హం.
 

ట్రంప్ సంచలన హెచ్చరిక
చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, సైనికపరమైన చర్యలు కూడా ఉండొచ్చని డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ లక్ష్యం కేవలం తాత్కాలిక శాంతి కాదని, ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్మూలించడమేనని ఆయన తెలిపారు. తుది ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

బెదిరింపులకు భయపడం: ఇరాన్
ఒత్తిడి తెచ్చి ఒప్పందాలకు తమకు ఒప్పించాలని చూస్తే అంగీకరించబోమని ఇరాన్ అధికారులు తేల్చిచెప్పారు. ‘అమెరికా బెదిరింపుల నీడలో మేము చర్చలు జరపబోము’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఖలీబాఫ్ ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. అవసరమైతే కొత్త వ్యూహాలతో బదులిస్తామని హెచ్చరించారు. మరోవైపు, ఈ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో సోమవారం చర్చించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండా ముగిసిన నేపథ్యంలో తాజా పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.

ఇది కూడా చదవండి: Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం

Advertisement
 
Advertisement
Advertisement