Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం | 5.2 Magnitude Quake Jolts Restless Manipur | Sakshi
Sakshi News home page

Manipur: తెల్లవారుజామున భారీ భూకంపం

Apr 21 2026 8:02 AM | Updated on Apr 21 2026 8:35 AM

5.2 Magnitude Quake Jolts Restless Manipur

కమ్‌జోంగ్‌: ఒకవైపు జాతి వివక్ష అల్లర్లు, వరుస బంద్‌లతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను తాజాగా ప్రకృతి ప్రకోపం భయభ్రాంతులకు గురిచేసింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం రాష్ట్రాన్ని మరోసారి తీవ్రంగా కుదిపేసింది. గాఢ నిద్రలో ఉన్న జనం భూమి  కంపించడంతో ప్రాణభయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం (ఏప్రిల్ 21) ఉదయం 5:50 గంటలకు మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 గా నమోదైంది. కమ్‌జోంగ్ జిల్లా కేంద్రంగా భూమికి 62 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక నివేదికలు అందలేదు.

అల్లర్లతో అగ్నిగుండంలా..
మరోవైపు రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు ఏమాత్రం సద్దుమణగలేదు. ఏప్రిల్ 7వ తేదీన బిష్ణుపూర్ జిల్లాలోని త్రోంగ్లాబీలో అనుమానిత మిలిటెంట్లు జరిపిన బాంబు దాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఇంఫాల్ లోయ ప్రాంతాలు అగ్నిగుండంగా మారాయి. ఈ దారుణ ఘటనను నిరసిస్తూ మహిళా సంఘం ‘మీరా పైబిస్’ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది. రాజధాని ఇంఫాల్‌లోని ఉరిపోక్, నాగారం వంటి ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

బంద్‌తో స్తంభించిన జనజీవనం
నిరసనకారుల ఆందోళనలతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. మైతేయి, నాగా వర్గాల ప్రాబల్యం ఉన్న ఐదు జిల్లాలతో పాటు ఉఖ్రుల్, సేనాపతి జిల్లాల్లో పబ్లిక్ రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపును ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించగా, 30 మందికి పైగా జనం గాయపడ్డారు. శనివారం థాంగ్మీబాండ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో మరో ఆరుగురు గాయపడగా, వారిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉండటం అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement