కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగుతోంది. ఎన్నికల వ్యూహకర్త సంస్థ ‘ఐ-ప్యాక్’ చుట్టూ అల్లుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలోని బీజేపీ మధ్య యుద్ధానికి దారితీశాయి. మనీ లాండరింగ్ విచారణతో మొదలైన ఈ వ్యవహారం.. దాడులు, అరెస్టులు, సమన్లు దాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయమున్న ‘గ్రీన్ ఫైల్’ ఎపిసోడ్‌తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇంతకీ ఈ ఐ-ప్యాక్ చుట్టూ ఏం జరుగుతోంది?
తనిఖీల నుంచి రాజకీయ రగడకు..
ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ఊహించని రీతిలో సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె తన అనుచరులు, పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రదేశం నుంచి కీలకమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మమత చేతిలో ఉన్న ఆ ‘గ్రీన్ ఫైల్’ దృశ్యాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
పరస్పర తీవ్ర ఆరోపణలు
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద జరుగుతున్న విచారణను సీఎం అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా తమ పార్టీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని, అభ్యర్థుల జాబితాను, హార్డ్ డిస్క్‌లను లాగేసుకుంటున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. ‘ఓ పార్టీ వ్యూహాలను, పత్రాలను ఎత్తుకెళ్లడం అమిత్ షా బాధ్యతా?’ అని ప్రశ్నించిన మమత, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి గెలవాలని సవాల్ విసిరారు.
బొగ్గు కుంభకోణం, హవాలా లింక్స్..
ఈ మొత్తం వివాదానికి మూలం 2020లో అనూప్ మాఝీ అలియాస్ లాలాకు చెందిన అక్రమ బొగ్గు మైనింగ్ కుంభకోణం. ఈ స్కామ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ మాతృసంస్థ అయిన ‘ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు మళ్లించారని ఈడీ ప్రధాన ఆరోపణ. హవాలా ఆపరేటర్ల ద్వారా కోట్ల రూపాయలు ఈ సంస్థకు బదిలీ అయ్యాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
సాక్ష్యాలను మాయం చేయడం ఏంటి?
ఈ ఆరోపణలపై దాడులు జరుగుతుండగా, ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి సాక్ష్యాలను మాయం చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మాఫియాకు మద్దతు ఇస్తున్నారని.. ప్రభుత్వాలను కూల్చడానికి, ఏర్పాటు చేయడానికి ఐ-ప్యాక్ నేరుగా మాఫియా నుంచి డబ్బులు తీసుకుంటోందని బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. విచారణను అడ్డుకున్న మమతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తు సమయంలో ముఖ్యమంత్రి ప్రవేశించి సాక్ష్యాలను తీసుకెళ్లడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు.
అరెస్టులు,ముమ్మర విచారణ..
మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐ-ప్యాక్ మరో సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ నిబంధనలకు అనుగుణంగానే ఈడీ వ్యవహరించిందని, సరైన ఆధారాలు సమర్పించిందని ఢిల్లీ కోర్టు సైతం స్పష్టం చేసింది. దర్యాప్తు విస్తృతం కావడంతో డైరెక్టర్ రిషి రాజ్ సింగ్‌కు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడమే కాకుండా, ప్రతీక్ జైన్, ఆయన భార్య, సోదరుడి వ్యాపార లావాదేవీలపై కూడా ఈడీ నిఘా పెట్టింది.
ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నాక..
2021 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఈ సంస్థ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇంకా కీలకంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న ఈ దాడులు టీఎంసీ ప్రచార యంత్రాంగాన్ని దెబ్బతీసే కుట్ర అని ఆ పార్టీ ఆరోపిస్తుండగా.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటోంది. ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నాడిని ప్రభావితం చేసే ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.


