అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి? | IAS Durga Shakti Nagpal Once suspended by Akhilesh now elevated by Yogi | Sakshi
Sakshi News home page

అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?

Apr 20 2026 5:11 PM | Updated on Apr 20 2026 6:04 PM

 IAS Durga Shakti Nagpal Once suspended by Akhilesh now elevated by Yogi

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో రాత్రికి రాత్రే భారీగా పరిపాలనా విభాగంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం రాత్రి 40 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ భారీ నిర్ణయం తీసుకుంది.2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్‌పాల్‌ (Durga Shakti Nagpal) ను దేవీపటన్ డివిజన్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అక్రమ ఇసుక మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపింది. అప్పటి అఖిలేష్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఆమెను సస్పెన్షన్‌. కట్‌ చేస్తే.. ఇపుడు యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు. ఇంతకీ ఎవరీ దుర్గా శక్తి నాగ్‌పాల్‌?

24 ఏళ్ల వయసులోనే ఐఏఎస్ అధికారి అయిన దుర్గా శక్తి నాగ్‌పాల్‌ ఘజియాబాద్ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పలు వాహనాలను అదుపులోకి తీసుకుని,  పలువురిని అరెస్టు చేసిన తర్వాత 2013లో వార్తల్లో నిలిచారు. ఇసుక మాఫియా, అక్రమ నిర్మాణాలపై పోరాడి ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారిణి దుర్గా శక్తి నాగ్‌పాల్‌. గతంలో ఆమె తన సాహసోపేతమైన నిర్ణయాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.  తాజాగా రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశాలను ధైర్యంగా ఎదుర్కొనే అధికారిణిగా పేరున్న దుర్గా శక్తి నాగ్‌పాల్‌కు కమిషనర్‌గా పదోన్నతి కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ బదిలీల్లో భాగంగా 15 జిల్లాల మేజిస్ట్రేట్లు (DMs), పలువురు చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, సెక్రటేరియట్ స్థాయి అధికారులను మార్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలక బాధ్యతలతో  అందరి దృష్టిని ఆకర్షించి, పేరు దుర్గా శక్తి నాగ్‌పాల్.

ఎవరీ దుర్గా శక్తి నాగ్‌పాల్?
నోయిడాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్రమ ఇసుక మాఫియాపై ఆమె ఉక్కుపాదం మోపారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఇది ఒక రాజకీయ దుమారాన్ని రేపడంతో పాటు, ఐఏఎస్ అసోసియేషన్ నుండి నిరసనలకు దారితీసింది. అంతేకాదు నిర్మాణంలో ఉన్న ఒక మసీదుకు అనుసంధానంగా ఉన్న గోడను కూల్చివేయమని ఆమె ఆదేశించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. 2013లొ సెప్టెంబర్‌లో ఆమె సస్పెన్షన్‌ను రద్దు చేశారు. ఆ వెంటనే ఆమె తిరిగి పరిపాలనా విధుల్లో చేరడం విశేషం.

ఆగ్రాకు చెందిన దుర్గాశక్తి ఇందిరా గాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తరువాత ఐఆర్‌ఎస్‌కు అర్హత సాధించిన ఈమె, రెండో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో  ఆల్ ఇండియాలో 20వ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించారు. మొదట పంజాబ్ కేడర్‌లో మొహాలీలో పనిచేశారు. ఆ తరువాత ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్‌ను వివాహం చేసుకోవడంతో యూపీ కేడర్‌కు మారారు. (అభిషేక్ సింగ్ ప్రస్తుతం తన పదవికి రాజీనామా చేసి నటనారంగంలో ఉన్నారు). గడిచిన సంవత్సరాలుగా, రాజకీయంగా సున్నితమైన సమస్యలను చేపట్టడానికి ముందుకొచ్చే దృఢమైన అధికారిణిగా నాగ్‌పాల్‌ పేరు సంపాదించు కున్నారు. అదే ఆమెకు ప్రతిష్టాత్మకంగా మారింది.  

ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

రాష్ట్ర స్థాయిలో, కీలకమైన శాఖలలో మార్పులు చోటుచేసుకున్నాయి. అశుతోష్ నిరంజన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా, కింజల్ సింగ్‌ను మాధ్యమిక విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. పాలనా దక్షతను పెంచడం, అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ 40 మంది అధికారుల బదిలీలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

మరికొన్ని కీలక మార్పులు:

  • జిల్లా మేజిస్ట్రేట్ల మార్పు: ఆగ్రా, సహారన్‌పూర్, బులంద్‌షహర్, రాయ్‌బరేలీ వంటి కీలక జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు.

  • మనీష్ బన్సల్: ఆగ్రా డిఎంగా నియామకం.

  • ఇంద్రజిత్ సింగ్: సుల్తాన్‌పూర్ డిఎంగా నియామకం.

  • కుమార్ హర్ష్: బులంద్‌షహర్ డిఎంగా బాధ్యతలు.

  • రాష్ట్ర స్థాయి మార్పులు: శుతోష్ నిరంజన్: రవాణా శాఖ కమిషనర్‌గా నియామకం.

  •  కింజల్ సింగ్: సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా బదిలీ.

ఇదీ చదవండి: కాన్పూర్‌ కవలల విషాదం, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

 

Advertisement
 
Advertisement
Advertisement