విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు | 4 Hours Air Horror Flyers Seen Praying, Crying On Fly91 Flight | Sakshi
Sakshi News home page

విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

Apr 20 2026 12:32 PM | Updated on Apr 20 2026 2:14 PM

4 Hours Air Horror Flyers Seen Praying, Crying On Fly91 Flight

విమానం ప్రయాణం ఎంత సౌకర్యవంతమో, ఎంత విలాసవంతమో అంత భయానకం కూడా. విమానం టేక్‌ ఆఫ్‌ అయింది మొదలు ల్యాండ్‌ అయ్యేదాకా మన ప్రాణాలు గాల్లోనే.  ఏదైనా  తేడా వచ్చిందా అంతే సంగతులు.  సరిగ్గా ఇలాంటి అనుభవమే ఫ్లై91 ప్రయాణీకులకు ఎదురైంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ  గాలిలో 4 గంటల పాటు గడపాల్సి వచ్చింది.

ఆదివారం  మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం IC3401 (ATR టర్బోప్రాప్ AT7), సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం హుబ్బళ్లిని సమీపిస్తుండగా,  అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలట్లు ల్యాండింగ్‌ను నిలిపి వేసి నాలుగు గంటలపాటు గాల్లోనే చక్కర్లు కొట్టారు.  దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సాంకేతిక లోపం కారణంగా విమానం అదుపు తప్పడంతో, ప్రయాణికులు భయంతో వణికిపోయారు, చాలామంది ఇష్టదైవాలకు ప్రార్థిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దేవుడా, కాపాడు దేవుడా అంటూ  వేయి దేవుళ్లకు మొక్కుకున్నారు. రెండు చేతులు జోడించి, నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక మహిళ  తీవ్ర ఆవేదన చెందింది. కంటి ధారగా కన్నీరు కారుస్తూ మౌనంగా ప్రార్థించిన ఘటన ఎవ్వరి హృదయాన్నైనా కరిగించకమానదు. 

ఇంకా, భయంతోవణికిపోతూ, "ఓరి దేవుడా...ఇతను ఎందుకిలా చేస్తున్నాడు,"  అని ఒకరు, "ఏడవకు, ఏడవకు-ఏమీ కాదు. ఆగు," అని మరొకరు ఓదార్చడం ఈ వీడియోలో గమించనవచ్చు. గాలిలో ఊహించని పరిణామంతో గందరగోళానికి గురైన దృశ్యాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా ఆ విమానం ముండ్‌గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై దాదాపు నాలుగు గంటల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది.

మరోవైపు ‘‘పరిస్థితిని అదుపులోనే  ఉంచుతున్నాం. మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాము. ఓపికగా ఉండండి, దయచేసి సూచనలను పాటించండి," అని పైలట్ ప్రయాణికులకు సూచిస్తున్నట్లు వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వలేదని, నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపించారు. ఉద్రిక్త క్షణాలు, పలు ప్రయత్నాల తర్వాత, విమానాన్ని చివరికి దారి మళ్లించి, రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement