సురేష్‌ గోపీ రాజీనామా?.. సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్! | I'm the only one who didn't know: Suresh Gopi slams resignation rumours | Sakshi
Sakshi News home page

సురేష్‌ గోపీ రాజీనామా?.. సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్!

Jun 6 2026 8:06 AM | Updated on Jun 6 2026 8:45 AM

I'm the only one who didn't know: Suresh Gopi slams resignation rumours

తిరువనంతపురం: కేంద్ర మంత్రి పదవికి సురేష్ గోపి రాజీనామా చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, పలు వార్తా సంస్థల్లో వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పూర్తిగా కొట్టిపారేశారు. మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ కల్పిత సినిమా కథలు అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

రూమర్లకు కారణం ఇదేనా?
కేరళలోని త్రిసూర్ నియోజకవర్గం నుండి విజయం సాధించి, ఆ రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా సురేష్ గోపి చరిత్ర సృష్టించారు. అయితే, తన పూర్తి స్థాయి సినీ కెరీర్‌ను కొనసాగించడం కోసం ఆయన మంత్రి బాధ్యతల నుండి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగింది. సినిమాలు ఆపేయడం వల్ల తన వ్యక్తిగత ఆదాయం భారీగా తగ్గిపోయిందని, అందుకే పదవి నుండి తప్పుకునేందుకు అనుమతించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కోరినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, కేంద్ర మంత్రివర్గంలో తన వారసునిగా కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్ పేరును కూడా సురేష్ గోపి ప్రతిపాదించారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి.

ఫేస్‌బుక్ వేదికగా గట్టి కౌంటర్
ఈ ప్రచారాలన్నింటికీ కేంద్ర మంత్రి సురేష్ గోపి తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా అత్యంత ఘాటుగా సమాధానం ఇచ్చారు. వైరల్‌గా మారిన తన సోషల్ మీడియా పోస్టులో ఆయన స్పందిస్తూ.. ‘సురేష్ గోపి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ విషయం మీకేమైనా తెలుసా? నిజానికి, ఈ సంగతి తెలియని ఏకైక వ్యక్తిని నేనే! నిజాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్లిక్ చేస్తే సరిపోతుంది. కాబట్టి, ఇలాంటి సినిమా స్క్రిప్ట్‌లను నమ్మి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు’ అంటూ వ్యంగ్యంగా నెటిజన్లను కోరారు.

ఫేక్ న్యూస్ రాయుళ్లకు హెచ్చరిక 
ఒకవైపు అగ్ర నటుడిగా, మరోవైపు బాధ్యతాయుతమైన ఎంపీగా రెండు పాత్రలను సమన్వయం చేసుకోవడం ఆయన రాజకీయ నిశ్చయానికి సవాలుగా మారిందంటూ విమర్శకులు చేసిన వ్యాఖ్యలను  ఆయన తోసిపుచ్చారు. ఈ సందర్భంగా తప్పుడు వార్తలను సృష్టిస్తున్న వారికి సురేష్ గోపి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫేక్ న్యూస్‌ను తయారు చేసేవారికి నేనొక్కటే చెబుతున్నాను.. అది పద్ధతి కాదు... ఇప్పటికైనా మీ అలవాటును మార్చుకోండి’ అంటూ ఆయన ఘాటుగా హితవు పలికారు. ఈ క్లారిటీతో గత కొన్ని రోజులుగా సాగుతున్న పొలిటికల్ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ పడింది.

ఇది కూడా చదవండి: రోబోల విప్లవమా?.. మానవాళి వినాశనమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement