కొచ్చి: కుంభమేళా సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే కేసులో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోనాలిసా, ఆమె భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ ముగిసింది. బుధవారం(ఇవాళ) ఈ కేసు తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న తీర్పు రిజర్వ్ చేసే సమయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
విచారణలో భాగంగా న్యాయమూర్తి కౌసర్ ఎడప్పగత్ “మీరు కేరళలో ఉన్నందుకు అదృష్టవంతులు” అని వ్యాఖ్యానించారు. దానికి మొనాలిసా తరఫు న్యాయవాది.. అందువల్లే వీళ్లు ఇంకా బతికి ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యపై నెట్టింట దుమారం రేగింది. జడ్జి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే..
న్యాయ వర్గాల ప్రకారం కోర్టు ఉద్దేశం కేసుపై ప్రత్యక్ష అభిప్రాయం వ్యక్తం చేయడం కాకుండా, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఈ కేసు చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, ఒత్తిళ్లు, భద్రతా పరిస్థితులను పరోక్షంగా సూచించడమేనని భావిస్తున్నారు. కేరళలో న్యాయ ప్రక్రియ తక్కువ ఒత్తిడితో, మరింత నిష్పక్షపాత వాతావరణంలో సాగుతోందన్న సందేశాన్ని ఆ వ్యాఖ్య ద్వారా ఇచ్చినట్లుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఈ కేసు ఒక సాధారణ వివాహ వివాదం నుంచి ఇప్పుడు ఇంటర్‌ఫెయిత్ వివాహం, వయస్సు నిర్ధారణ(ఆమె మైనర్ అనే ఆరోపణలు), ఫోర్జరీ ఆరోపణలు, కిడ్నాప్ కేసులు వంటి పలు తీవ్రమైన ఆరోపణలతో కేరళ-మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్ద న్యాయ వివాదంగా మారింది. మోనాలిసా వివాహం, ఆమె వయస్సు నిర్ధారణ, మతాంతర వివాహ చట్టబద్ధతతో పాటు పలు రాష్ట్రాల్లో నమోదైన క్రిమినల్ కేసులు వంటి పలు క్లిష్ట అంశాలు ఒకేసారి విచారణ జరిగాయి.
ఇక మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమపై వివిధ వర్గాల నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వయస్సు తప్పుడు నమోదు, ఫోర్జరీ ఆరోపణలు సహా కేసు తీవ్రమని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసు కేవలం వ్యక్తిగత వివాదంగా కాకుండా రెండు రాష్ట్రాల అంశంగా మారింది. తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.


