ఒంటిపై గాయాలు, గీతలు.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేసులో ట్విస్ట్‌ | Delhi University Professor Devosmita Paul Death Mystery | Sakshi
Sakshi News home page

ఒంటిపై గాయాలు, గీతలు.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేసులో ట్విస్ట్‌

Jun 5 2026 10:36 AM | Updated on Jun 5 2026 10:45 AM

Delhi University Professor Devosmita Paul Death Mystery

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ తన అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఫ్లాట్ లోపల నుంచి తాళం వేసి ఉండటం, శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని డెవోస్మితా పాల్‌గా గుర్తించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పలువురు ఫోన్ కాల్స్‌కు ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో, ఆమె సోదరి ప్రత్యక్షంగా అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అపార్ట్‌మెంట్ సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, మహిళా ప్రొఫెసర్ శవమై కనిపించారు.

అయితే, ప్రాథమిక విచారణలో శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తలపై బలమైన దెబ్బలు, మణికట్టు వద్ద గాయాలు కనిపించినట్లు ఫోరెన్సిక్ టీమ్ తెలిపింది. దీంతో ఇది సహజ మరణం కాకుండా హత్యగా నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు యథాతథంగా ఉండటంతో దోపిడీ కోణాన్ని పోలీసులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీని ఆధారంగా ఈ హత్య వ్యక్తిగత శత్రుత్వమా? లేదా తెలిసిన వ్యక్తి ద్వారా జరిగిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇక, ఈ కేసులో పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం. ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటమే. ఘటన అనంతరం నిందితుడు తలుపు వేసి వెళ్లి ఉండవచ్చని లేదా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అలాగే, అపార్ట్‌మెంట్‌లోకి వచ్చిన వ్యక్తుల వివరాలు పరిశీలించినట్టు తెలిపారు. బాధతురాలు మొబైల్ కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement