400 ఏళ్ల చరిత్ర కలిగిన దత్త ఆలయానికి మోక్షం ఎపుడు? | Speial story Dattatreya temple in Varadavelli Hill Rajanna Sircilla district | Sakshi
Sakshi News home page

400 ఏళ్ల చరిత్ర కలిగిన దత్త ఆలయానికి మోక్షం ఎపుడు?

Apr 20 2026 6:37 PM | Updated on Apr 20 2026 7:03 PM

Speial story Dattatreya temple in Varadavelli Hill Rajanna Sircilla district

రూ.8.80 కోట్లతో అప్రోచ్‌ రోడ్డుకు అంచనాలు

నిధుల మంజూరుకోసం ఎదురుచూపులు

రోడ్డు నిర్మాణానికి వేసవికాలం అనువు 

బోయినపల్లి:  రాజన్న సిరిసిల్లా జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు పరిధిలో మండలంలోని వరదవెల్లి గుట్టపై స్వయంభూగా వెలసిన దత్తాత్రేయస్వామి ఆలయం అప్రోచ్‌ రోడ్డుకు మోక్షం లభించడం లేదు. రోడ్డు నిర్మాణంలో భాగంగా నిధుల మంజూరుకు ఎదురుచూపులు తప్పడం లేదు. గుట్టపై దత్త ఆలయానికి వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్‌తో పాటు గ్రామానికి చెందిన పలువురు భక్తులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పలుసార్లు వినతిపత్రాలు అందించారు. వారి ఆదేశాలతో ఇరిగేషన్‌శాఖ రూ.8.80 కోట్లతో గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లేందుకు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి అంచనాలు రూపొందించింది. ఈమేరకు అప్రోచ్‌ రోడ్డు నిధుల మంజూరుకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి రాసినన లేఖలో కోరారు. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా 318 వరకు  హార్టింగ్‌ జోన్‌ ఏర్పాటు, కట్ట నిర్మాణం, ఇరువైపులా డ్రైరిట్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ వాల్‌ ఇతర పనులు అంచనాల్లో చేర్చారు. 

వేసవికాలం అనువు
వర్షాకాలం నుంచి ఫిబ్రవరి వరకు ఆలయం చుట్టూ మిడ్‌మానేరు బ్యాక్‌ వాటర్‌ ఉంటుంది. మధ్యలో ద్వీపకల్పంలా ఆలయం కనిపిస్తుంది. ఏటా డిసెంబర్‌లో ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వర్షాకాలంలో ఆలయం చుట్టూ బ్యాక్‌ వాటర్‌ చేరడంతో భక్తులు, పూజారులు నిత్య పూజలు, పౌర్ణమిరోజు ప్రత్యేక పూజలు బోటులో వెళ్లి చేసేవారు. కాగా ఇప్పుడు వేసవి కావడంతో నీరులేక ఆలయం కనిపిస్తోంది. ఆలయం వెళ్లేందుకు భక్తులు ఏర్పాటు చేసుకున్న మట్టి దారి కనిపిస్తోంది. వేసవిలో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి అనువైన సమయం అని భక్తులు తెలుపుతున్నారు. ప్రభుత్వం అప్రోచ్‌ రోడ్డుకు త్వరగా నిధులు మంజూరుచేస్తే ఆలయం వెళ్లేందుకు మార్గం సుగమమవుతుందని భక్తులు తెలుపుతున్నారు. 

ఇదీ చదవండి: అపుడు సస్పెన్షన్‌, ఇపుడు సీఎం యోగీ ఎలివేషన్‌, ఎవరీ దుర్గా శక్తి?
 

గిరి ప్రదక్షిణలు.. ప్రత్యేక పూజలు
గురు దత్తాత్రేయస్వామి ఆలయం రోజురోజుకూ ప్రసిద్ధికెక్కుతోంది. ప్రాజెక్టులో నీరున్న సమయంలో ఆలయానికి వెళ్లేందుకు ప్రభుత్వం టూరిజంశాఖ ఆధ్వర్యంలో బోటు సౌకర్యం కల్పిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, ముంబై ప్రాంతాలనుంచి భక్తులు పెద్ద మొత్తంలో వస్తారు. ఇటీవల నీరు లేకపోవడంతో భక్తులు ప్రతీ పౌర్ణమి, అమవాస్యకు ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. సామూహిక దత్త సత్యవ్రతాలు, సామూహిక హనుమాన్‌ చాలీసా, భగవద్గీత పారాయణం, నిత్య పూజలు, అభిషేకాలు వైభవంగా జరుగుతాయి. మిగతా రోజుల్లో సైతం వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక హోమాలు చేస్తారు.

ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

సెలవు రోజుల్లో రద్దీ
నీరు ఉన్న సమయంలో సెలవు రోజు వచ్చిందంటే ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. బోటులో ఆలయానికి వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.150 టికెట్‌ ధర తీసుకుంటున్నారు. మా నీటిలో ఆలయం వెళ్లి అక్కడి ప్రకృతి ఒడిలో సేద తీరేందకు పలువురు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ప్రభుత్వం వెంటనే ఆలయం అప్రోచ్‌ రోడ్డుకు నిధులు మంజూరుచేస్తే ఆలయానికి శాశ్వత రోడ్డు సౌకర్యం కలుగుతుందని భక్తులు తెలుపుతున్నారు. 

 రూ.8.80కోట్లతో అప్రోచ్‌ రోడ్డుకు అంచనాలు 
వరదవెల్లి గురు దత్తాత్రేయస్వామి గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లేందుకు సీఈసీడీఓ (చీఫ్‌ ఇంజినీర్‌ సెట్రల్‌ డిజైన్స్‌ ఆఫీస్‌) వారికి డిజైన్‌తో అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంకోసం రూ.8.80 కోట్ల మేర అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు. నిధులు మంజూరుచేస్తే అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రాసెస్‌ మొదలుపెడతాం.     –జగన్, మిడ్‌మానేరు, ఈఈ    

 

Advertisement
 
Advertisement
Advertisement