ఎస్‌ఆర్‌హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్‌లో ఆరు సార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడూ కనీసం ఐదు సార్లు కూడా 20 బంతుల్లోపు హాఫ్ సెంచరీలు చేయలేదు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా అభిషేక్ సరికొత్త చరిత్ర లిఖించాడు.
ఈ రికార్డుతో పాటు అభిషేక్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. అతని టీ20 కెరీర్‌లో 15 అంతకంటే తక్కువ బంతుల్లో నాలుగు సార్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేశాడు. ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అతనే.
తాజాగా అభిషేక్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది అత్యంత వేగవంతమైనది. ఈ ఇన్నింగ్స్‌లో అతను మొత్తంగా 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే సీఎస్‌కేపై సన్‌రైజర్స్ గెలుపొందింది.
అభిషేక్ ఇచ్చిన మెరుపు ఆరంభం ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి పునాది వేసింది. అతను అర్ద సెంచరీ తర్వాత ఔటైనా క్లాసెన్ స్కోర్‌ను 200 మార్కు దగ్గరికి (194-9) తీసుకెళ్లాడు. అనంతరం ఛేదనలో సగం మ్యాచ్ వరకు గెలుపు దిశగా సాగిన సీఎస్‌కే, ఆతర్వాత ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు చెలరేగడంతో లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయి, 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.
ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్‌కే గెలుపును అడ్డుకున్నారు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ చేసిన హాఫ్ సెంచరీకి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (15). ఇదే ఇన్నింగ్స్‌తో అభిషేక్ ఐపీఎల్‌లో 2000 పరుగులు (1192 బంతులు) కూడా పూర్తి చేశాడు. ఈ మైలురాయిని అత్యంత వేగంగా తాకిన ఆటగాళ్ల జాబితాలో ఆండ్రీ రసెల్ (1120 బంతులు) తర్వాతి స్థానంలో నిలిచాడు.


