పాక్‌కు ఇరాన్‌ సరికొత్త మెలిక | Iran New Conditions Before Pak For US Talks | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఇరాన్‌ సరికొత్త మెలిక

Apr 20 2026 12:06 PM | Updated on Apr 20 2026 12:14 PM

Iran New Conditions Before Pak For US Talks

పశ్చిమాసియా సంక్షోభంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఇరాన్‌ వాణిజ్య నౌకను అమెరికా దళాలు సీజ్‌ చేయడం.. అటుపై కౌంటర్‌ దాడులతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శాంతి చర్చలకు తమ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లదని ఇరాన్‌ ప్రకటించడంతో.. పరిస్థితి మొదటికి వచ్చింది. అయితే చర్చలకు సిద్ధమని ప్రకటించిన ఇరాన్‌ కొత్త షరతులతో మధ్యవర్తి పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేసినట్లు తెలుస్తోంది.  

అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్‌ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్‌ కుదర్చడం ద్వారా ట్రంప్‌నకు మరింత దగ్గర కావాలని.. తమ దేశం చివర ‘శాంతిదూత’ అనే ట్యాగ్‌ తగిలించుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తోంది. అయితే తొలి దఫా చర్చల కోసం పేలవమైన నిర్వహణ.. డీల్‌ కుదర్చడంలో విఫలం కావడంతో అంతర్జాతీయ సమాజంలో పాక్‌ నవ్వులపాలైంది. దీంతో రెండో దఫా చర్చలను ఎలాగైనా సక్సెస్‌ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. 

అయితే.. ఇరాన్‌ మాత్రం పాక్‌ను మిత్రదేశంగా కాకుండా.. మధ్యవర్తిగానే చూస్తూ చర్చల విషయంలో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇరాన్‌ను ఇబ్బంది పెట్టే ఏ ప్రయత్నాన్ని తాము అంగీకరించబోమని అంటోంది. అమెరికా డిమాండ్లు వాస్తవానికి దూరంగా ఉన్నాయని.. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అప్పగించే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టింది. ఇదే విషయంపై ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తో ఫోన్‌లో ప్రస్తావించారు. 

ఈ ఫోన్‌కాల్‌లో ఆయన.. అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా లేమని చెప్పారు. అయితే ఆఖర్లో ఇరాన్‌ భద్రతా ప్రయోజనాలను కాపాడే షరతులపై మాత్రమే చర్చలకు తాము ముందుకు వస్తామని స్పష్టం చేశారు. ‘‘మా అణు కార్యక్రమం శాంతి ప్రయోజనాల కోసం. దాన్ని వదులుకోవడం అసాధ్యం’’ అని పాక్‌ ప్రధానితో ఇరాన్‌ అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే.. 

ఈ విషయంలో అమెరికా ఓ మెట్టు పైనే ఉంటోంది. ఇరాన్‌ అణు ప్రోగ్రామ్‌ తగ్గించాలని, శుద్ధి చేసిన యురేనియంను అంతర్జాతీయ పర్యవేక్షణ కోసం తమకే అప్పగించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ విషయంలో ఇరాన్‌ను ఒప్పించే పూచీ తమదని ట్రంప్‌నకు తొలి నుంచి పాక్‌ చెబుతూ వస్తోంది. ఈ హామీ ఆధారంగానే ట్రంప్‌ బాహాటంగా ఇరాన్‌ అన్నింటికీ అంగీకరిస్తుందంటూ వరుస స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అయితే.. 

ఇరాన్‌ మాత్రం ఆ కండిషన్లకు ససేమీరా అంటోంది. వాటిని ‘అసాధ్యమైనవి’గా పేర్కొంటూ అవసరమైతే చర్చలనే బహిష్కరిస్తామని హెచ్చరిస్తోంది. ఈ కఠిన వైఖరి ట్రంప్‌నకు మరింత మంట పుట్టిస్తోంది. అదే టైంలో.. పాక్‌కు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతోంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. ఇరాన్‌–అమెరికా మధ్య చర్చలు జరగడం ప్రాంతీయ శాంతికి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇరాన్‌ తన అణు హక్కులను వదులుకోదనే స్పష్టమైన సంకేతం ఇస్తూ.. అమెరికాను ఢీ కొట్టి తీరతామనే వైఖరిని ప్రదర్శిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement