ట్రంప్‌ కొత్త రాగం.. మా కండీషన్‌ అదే.. | Donald Trump Says US Winning war by a lot | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కొత్త రాగం.. మా కండీషన్‌ అదే..

Apr 21 2026 7:49 AM | Updated on Apr 21 2026 8:35 AM

Donald Trump Says US Winning war by a lot

వాషింగ్టన్‌: అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్‌ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

అధ్యక్షుడు ట్రంప్‌ సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్‌పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.

ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్‌ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement