గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దాంతో అంతా మొబైల్ ఫోన్లు, వైఫై రౌటర్లు, స్క్రీన్ టైం తదితరాలే అందుకు కారణమని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగావీటన్నింటికి ఒత్తిడి కూడా తోడవ్వుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జూన్ 8 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే (World Brain Tumor Day) సందర్భంగా డిజిటల్ వినియోగం ఈ సమస్యకు ఎంత వరకు కారణం? శాస్త్రీయపరంగా ఇది ఎంత వరకు కరెక్ట్ వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
వై-ఫై, స్మార్ట్‌ఫోన్‌లు, ఒత్తిడి, లేదా అధిక స్క్రీన్ టైమ్ వంటివే బ్రెయిన్ ట్యూమర్‌కి ప్రధాన కారణమని చెప్పడానికి సరైన ఆధారాలే లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా డిజిటల్ వాడకం వల్ల రేడియేషన్ బారినపడతారనే దానిపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మొబైల్ ఫోన్లు మరియు వై-ఫై పరికరాల నుంచి లువడే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ కారణంగానే ఈ ఆందోళన వ్యక్తమైందది గానీ..ఎక్స్-రేలు లేదా అణు పదార్థాల నుంచి వెలువడే అయనీకరణ రేడియేషన్ లా కాకుండా RF రేడియేషన్‌ను తక్కువ-శక్తి గలదిగా, అయనీకరణం చెందనదిగా పరిగణిస్తారని అన్నారు.
అందువల్లే కేన్సర్ పరిధకులు..మొబైల్ ఫోన్లు లేదా వై-ఫై సాధారణ వాడకం బ్రెయిన్ కేన్సర్‌కు కారణమని నిర్థారించలేమని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ వాడకం బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదాన్ని ఎంత మేరకు కలిగించగలదో చేసిన అధ్యయనంలో మిశ్రమ ఫలితాలే వచ్చాయన్నారు. కొన్ని అధ్యయనాల్లో ఫోన్‌ని అతిగా వాడే వారిలో కొన్ని అరుదైన కణితులు పెరిగినట్లు తేలిందని..మరికొన్ని పరిశోధనల్లో సరైన ఫలితాలివ్వలేదని చెబుతున్నారు. దీనిపై మరింత దీర్ఘకాలిక పరిశోధన అవసరమని చెబుతున్నారు.
అధిక స్క్రీన్ సమయం బ్రెయిన్‌ని దెబ్బతీస్తుందా?
స్క్రీన్ సమయం బ్రెయిన్ ట్యూమర్‌కి కారణమని నేరుగా చెప్పలేకపోయినా.. అధికంగా వాడకం మాత్రం ఇతర మార్గాల్లో మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదన్నారు. ఒకవేళ స్క్రీన్‌ల ముందు ఎక్కువ గంటలు గడడితే మాత్రం..
కంటి ఒత్తిడి, తలనొప్పులు
నిద్ర నాణ్యత తగ్గడం
ఒత్తిడి, ఆందోళన పెరగడం
శారీరక శ్రమ తగ్గడం
మానసిక అలసట
కానీ స్క్రీన్‌ల నుంచి వెలువడే నీలి కాంతి, ముఖ్యంగా రాత్రి పొద్దుపోయాక పరికరాలను ఉపయోగించినప్పుడు, మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించి, నిద్ర చక్రాలను కూడా భంగపరచవచ్చు. అందుకే ఆరోగ్య నిపుణులు వినోదం కోసం చూసే స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోవాలని, క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదీఏమైనా..ఈ అధిక డిజిటల్ వినియోగం మానసిక శారీరక ఆరోగ్యంపై కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
ఒత్తిడి కారణమా?
కేన్సర్‌తో సహా అన్ని రోగాలకు ఒత్తిడే కారణమని చెబుతుంటారు. దీర్ఘకాలిక ఒత్తిడి రోగనిరోధక శక్తిని బలహీనపరిచి, వాపును పెంచి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ..ఒత్తిడి మెదడు కణితులకు కారణమవుతుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవనే అంటున్నారు.
అసలు కారణం ?
చాలా సందర్భాలలో, మెదడు కణితులకు ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉందన్నారు. అయితే, శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అనేక ప్రమాద కారకాలను గుర్తించారు. అవేంటంటే..
జన్యుపరమైన పరిస్థితులు, వారసత్వంగా వచ్చే సిండ్రోమ్‌లు
అధిక మోతాదులో అయోనైజింగ్ రేడియేషన్‌కు గురికావడం
వయస్సు
కొన్ని రకాల కేన్సర్ల కుటుంబ చరిత్ర
అరుదైన సందర్భాల్లో పర్యావరణ విషపదార్థాలు
సాధ్యమైనంత వరకు మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ, క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య పోషణతో ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే రెగ్యులర్ చెకప్‌లతో ముందుగానేబ్రెయిన్ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం వంటివి చేస్తే..ఈ సమస్య దరిచేరదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


