సింగిల్‌ మదర్‌గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం! | From IIT Failure To Google Success, Techie’s Emotional Times Square Tribute To Mother Goes Viral | Sakshi
Sakshi News home page

సింగిల్‌ మదర్‌గా పడ్డ కష్టానికి..కుమారుడిచ్చిన గొప్ప గౌరవం!

Jun 8 2026 11:35 AM | Updated on Jun 8 2026 12:56 PM

Indian Techie Surprises Single Mother With Times Square Billboard

ఓ అమ్మ ఒంటరిగా పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ కష్టానికి తగ్గట్టుగా కొడుకు ప్రయోజకుడు అయితే ఆ ఆనందం మాటలకందనిది. కానీ అదే కుమారుడు ఆ అమ్మ కష్టాన్ని గుర్తించి గౌరవిస్తే..అంతకంటే ఆ తల్లికి కావల్సిందేముంటుంది. అలాంటి సందర్భమే ఇక్కడే చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

అతడు ఒకప్పుడు ఐఐటీ జేఈఈ పరీక్షల్లో విఫలమైన భారతీయ్‌ టెక్‌ నిపుణుడు అభిజయ్‌ అరోరా. తన తల్లికి భావోద్వేగభరితమైన నివాళి అర్పించడంతో నెట్టింట వైరల్‌గా మారాడు. అతడు ప్రస్తుతం గూగుల్‌ పనిచేస్తున్నాడు. ఆయన తనతల్లి తనను ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు పడ్డ కష్టానికి తగిన గౌరవం దక్కేలా  న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డు భారీ స్క్రీన్‌పై తనతోపాటు తనతల్లి ఫోటో కనిపించేలా చేశాడు. 

అభిజయ్‌ తన తల్లికి వీడియో  కాల్‌ చేసి మరి ఆ భారీ స్క్రీన్‌ని చూపించి సంతోషం వ్యక్తం చేశాడు. వేల మైళ్ల దూరం నుంచి చూస్తున్న ఆమె ఆ నివాళి తనకే అంకితం చేయబడిందని తెలిసి చిరునవ్వులు చిందించింది. అభిజయ్‌ అందుకు సంబంధించిన వీడియోని పంచుకుంటూ..పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. 

"ఆమె తన కలల కన్నా నా కలలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎన్నో ఎదురుదెబ్బలు, అనిశ్చితిలో తనకు అండగా నిలిచిన మహిళ మా అమ్మ. అందుకే ఆమెను ఇలా గౌరవించా. ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ఆమె చేసిన త్యాగాలన్నింటికీ నా నా కృతజ్ఞతను తెలియజేయడానికి, నేను మా అమ్మను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై చూపించాను." అని పేర్కొన్నాడు. దాంతోపాటు తన సక్సెస్‌ జర్నీని కూడా పంచుకున్నాడు.

ఐఐటీ ఫెయిల్‌ నుంచి గూగూల్‌ ఉద్యోగిగా..
హర్యానాలోని పంచకులకు చెందిన అభిజయ్‌ బాల్యం అంతా తన ఒంటరి తల్లి ఆధ్వర్యంలోనే సాగిందని చెప్పుకొచ్చాడు. తన స్థోమత కారణంగా పాత పుస్తకాలు చదువుకునేవాడినని తెలిపాడు. కానీ తన అమ్మ తనకు మంచి విద్య అందించాలని తపించిపోయేది. అందుకోసం ఏం చేయాలో అన్ని చేసేది. 

అయితే అత్యంత పోటీతో కూడిన ఐఐటీ జేఈఈలో ఫెయిలై అమ్మని నిరాశపరిచిన క్షణం తనని నిద్రపోవనివ్వకుండా చేసేదని అన్నాడు. ఏనాటికైనా  అమ్మని గర్వంగా తలెత్తుకునేలా చేయాలని బలంగా అనుకునేవాడినని చెప్పాడు.  అయితే 2016లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన వెంటనే ఏ ఉద్యోగ ఆఫర్‌ తనకు రాలేదని, 2017లో హ్యాకథాన్‌ గెలుచుకోవడం తన మొదటి గెలుపని చెప్పుకొచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్లీ 2016 నుంచి 2020 వరకు మొత్తం మూడుసార్లు జీమ్యాట్‌ పరీక్ష రాసినా.. ఓటమే ఎదురైందని వెల్లడించాడు. 

కానీ 2021లో తాను దరఖాస్తు చేసుకున్న ప్రతి బిజినెస్ స్కూల్‌ నుంచి తిరస్కరణను ఎదుర్కొన్నాడు. అమెరికాలో కూడా తన కష్టాలు కొనసాగాయి. అక్కడ కూడా అతను ఉద్యోగం కోసం వెతుకుతూనే 90 రోజుల వీసా గడువుతో పోటీ పడాల్సి వచ్చింది. వారానికి దాదాపు వంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నా..పదే పదే రిజెక్ట్‌ అవుతూనే ఉండేవి. 

అయితే ఆ టైంలో తన భార్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోగా, తల్లి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇలా లాభం లేదని తనే అవకాశాలు సృష్టించుకోవాలని భావించి అభిజయ్ ఒక AI-ఆధారిత రెజ్యూమె టూల్‌ను తన నెట్‌వర్క్‌ను, గుర్తింపును విస్తరించుకోవడానికి ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను పంచుకోవడం ప్రారంభించాడు. 

ఈ వ్యూహం ఫలించి.. 2022లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. 2025 నాటికి, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని యూట్యూబ్ కోసం గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాడు. ఆ తర్వాత, అతను సిలికాన్ వ్యాలీ AI నాయకులతో ఒక పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించి..దాదాపు ఆరు లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక ఆన్‌లైన్‌ కమ్యూనిటీని నిర్మించుకున్నాడు. 

అలా తల్లి పడ్డ త్యాగాలకి, కష్టానికి సరైన అర్థం ఇ‍చ్చేలా మంచి ఉన్నత స్థాయికి చేరుకున్న అభిజిత్‌ అందుకు కృజ్ఞతలు తెలుపుతూ ఇలా అమ్మకు టైమ్స్ స్క్వేర్ నివాళి అందించాడు. నెటిజన్లు కూడా ఆ తల్లికి ఇది హృదయపూర్వక కృతజ్ఞత, ఆమె గర్వించేలా మరింతగా ఎదగండి అంటూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: తండ్రి ఐఐటీ..కానీ కుమారుడు ఫెయిల్‌..! కట్‌చేస్తే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement