మోదీ మ్యాజిక్‌ ఇలాగే ఉంటుంది మరి! | Modi Magic Goes Viral, PM Modi's Selfie Video On NEET Sparks Massive Social Media Buzz | Sakshi
Sakshi News home page

మోదీ మ్యాజిక్‌ ఇలాగే ఉంటుంది మరి!

Jul 25 2026 7:49 AM | Updated on Jul 25 2026 8:47 AM

Modi Magic Goes Viral: PMs NEET Video Draws Massive Response

నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్‌ క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్‌లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. 

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేశారు. అందులో.. పేపర్‌ లీక్‌పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

ప్రధాని మోదీ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్‌, లైక్స్‌, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. 

నీట్‌ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.

ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్‌ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్‌ చేశారాయన. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్‌ ఇమేజ్‌, సోషల్‌ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్‌ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. 

నీట్‌ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్‌ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement